
- తిరిగి 25 వేల పైకి నిఫ్టీ
- 442 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- రిలయన్స్ షేర్లు 3 శాతానికి పైగా డౌన్
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల ర్యాలీతో సోమవారం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు లాభాల్లో కదిలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 442.61 పాయింట్లు (0.54శాతం) పెరిగి 82,200.34 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలంగా ట్రేడవ్వడం కలిసొచ్చింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 122.30 పాయింట్లు (0.49శాతం) ఎగసి 25,090.70 వద్ద సెటిలయ్యింది. కిందటి వారంలోని శుక్రవారం సెషన్‌లో నిఫ్టీ కీలక లెవెల్ అయిన 25 వేల దిగువకు పడిపోయింది. ఒక నెల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. బ్యాంక్ షేర్ల దన్నుతో సోమవారం 25 వేల లెవెల్‌ను తిరిగి అధిగమించింది. సెన్సెక్స్ లోని కంపెనీలలో ఎటర్నల్ షేర్లు 5.38 శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 2.76శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 2.19శాతం లాభపడ్డాయి. వీటి రిజల్ట్స్ మెప్పించడమే ఇందుకు కారణం.
మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్ కూడా పెరిగాయి. ఇండియన్ మార్కెట్‌లో తిరిగి ట్రేడింగ్ చేసుకునేందుకు యూఎస్ కంపెనీ జేన్ స్ట్రీట్ కు సెబీ అనుమతి ఇవ్వడంతో బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు పెరిగాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం సోమవారం 3.29 శాతం నష్టపోయాయి. నికర లాభం ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 78 శాతం పెరిగినా, ఈ కంపెనీ షేర్లు పడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, హిందుస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, ఐటీసీ షేర్లు కూడా సోమవారం నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఆంథెమ్ బయోసైన్సెస్ షేర్లు ఐపీఓ ధర రూ.570 కంటే 27 శాతం ప్రీమియంతో రూ.723.10 వద్ద మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
కొన్ని బ్యాంకుల రిజల్ట్స్ మెప్పించడంతో మార్కెట్ శుక్రవారం నష్టాల నుంచి రికవర్ అయ్యిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇన్వెస్టర్లు కంపెనీల ఆదాయాలపై దృష్టి సారించి వాటి వాల్యుయేషన్‌లను అంచనా వేస్తున్నారని తెలిపారు. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలపై మార్కెట్ తీవ్రంగా స్పందించిందని, బుల్స్, బేర్స్ మధ్య పోటీ నడుస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. కంపెనీల రిజల్ట్స్ మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయిస్తాయని చెప్పారు. కాగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సోమవారం 0.55శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది. సెక్టోరల్ ఇండెక్స్‌లలో క్యాపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, కమోడిటీస్, ఆటో కన్స్యూమర్ డిస్క్రిషనరీ రంగాలు లాభపడ్డాయి.
లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ, షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ లాభాలతో ముగిశాయి. జపాన్ మార్కెట్లు సెలవు కారణంగా మూతపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో, యూఎస్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. ఎఫ్‌ఐఐలు శుక్రవారం నికరంగా రూ.374.74 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, సోమవారం నికరంగా రూ.1,700 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.48శాతం తగ్గి బ్యారెల్‌కు 68.93 డాలర్ల వద్ద కదులుతోంది.