
- 23,250 పైన నిఫ్టీ
- రూ. 12.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో ప్రభుత్వ కంపెనీల షేర్లు జూమ్
ముంబై: మార్కెట్ సోమవారం సెషన్‌లో దూసుకుపోయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి మెజార్టీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. 30 షేర్లున్న సెన్సెక్స్ సోమవారం ఏకంగా 2,507 పాయింట్లు (3.39 శాతం) ర్యాలీ చేసి 76,469 వద్ద సెటిలయ్యింది. గత మూడేళ్లలో సెన్సెక్స్ ఒక సెషన్‌లో ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 76,739 వరకు పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 733 పాయింట్లు ర్యాలీ చేసి 23,264 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో 23,339 లెవెల్ దగ్గర సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం భారీగా పెరిగాయి. ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.8 లక్షల కోట్లు దాటడం గమనార్హం. ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ (8.2 శాతం) కిందటి ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించడంతో కూడా మార్కెట్ భారీగా పెరిగింది.
అదానీ షేర్లు జూమ్
అదానీ గ్రూప్ షేర్లు సోమవారం సెషన్‌లోనూ దూసుకుపోయాయి. అదానీ పవర్ షేర్లు 16 శాతం వరకు ర్యాలీ చేయగా, అదానీ పోర్ట్స్ 10 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 9 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 8 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 7 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 6 శాతం లాభపడ్డాయి. గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ19 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు పీఎస్‌యూ, పవర్, యుటిలిటీస్, ఆయిల్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ ఇండెక్స్‌లు 8 శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్ షేర్లు సోమవారం 9 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు భారీ లాభాలతో సెషన్‌ను ముగించాయి. మరోవైపు సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. ప్రభుత్వ కంపెనీల షేర్లు సోమవారం దూసుకుపోయాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. సంస్కరణలు కొనసాగుతాయని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారని చెప్పారు. గ్లోబల్‌గా సియోల్, టోక్యో, హాంకాంగ్ మార్కెట్‌లు లాభాల్లో ముగియగా, షాంఘై మార్కెట్ నష్టపోయింది. యూరోపియన్ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం సెషన్‌లో రూ.6,850 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
5.10 ట్రిలియన్ డాలర్లకు మార్కెట్ క్యాప్..
ఇండియా స్టాక్ మార్కెట్ ఎం–క్యాప్ 5.10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. సోమవారం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దీంతో మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ.422 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్‌లలో నాల్గో ప్లేస్‌లో ఇండియా ఉంది. యూఎస్, చైనా, జపాన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.