సెన్సెక్స్ 253 పాయింట్లు అప్​

సెన్సెక్స్ 253 పాయింట్లు అప్​
  • నేడు స్పెషల్​ ట్రేడింగ్​ సెషన్​

 ముంబై : ఇండెక్స్ మేజర్లు ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీలలో కొనుగోళ్ల వల్ల ఈక్విటీ బెంచ్‌‌మార్క్‌‌లు సెన్సెక్స్,  నిఫ్టీ శుక్రవారం వరుసగా రెండవ రోజు లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధుల ప్రవాహం వల్ల లాభాలు తగ్గాయని ట్రేడర్లు తెలిపారు. సెన్సెక్స్ 253.31 పాయింట్లు పెరిగి 73,917.03 వద్ద స్థిరపడింది. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 62.25 పాయింట్లు పెరిగి 22,466.10 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌‌లో ఎం అండ్‌‌ ఎం అత్యధికంగా లాభపడింది.

ఇది 5.97 శాతం పెరిగింది. జేఎస్​డబ్ల్యూ స్టీల్, అల్ట్రా సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ, తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.73 శాతం లాభపడి రూ.2,871 వద్ద ముగిసింది. అయితే టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​యూఎల్​ నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో  ఇన్ఫోసిస్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బ్రాడర్ మార్కెట్‌‌లో బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్ 1.18 శాతం, స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ 1.39 శాతం లాభపడ్డాయి.

రంగాలవారీగా చూస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.41 శాతం ఎగబాకగా, ఆటో 1.80 శాతం, రియాల్టీ 1.68 శాతం, మెటల్ 1.50 శాతం, కమోడిటీస్ 1.55 శాతం, ఇండస్ట్రియల్స్ 1.26 శాతం, ఆయిల్ గ్యాస్ 1.26 శాతం, ఐటీ 1.19 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాల్లో ఉండగా, సియోల్, నిక్కీ నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.

గురువారం నాటి ఓవర్‌‌నైట్ ట్రేడింగ్‌‌లో వాల్ స్ట్రీట్ లాభాల్లో ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌కు 0.25 శాతం పెరిగి 83.48 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) గురువారం రూ. 776.49 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. ఇదిలా ఉంటే, అంతరాయాలు ఎదురైనప్పుడు సంసిద్ధతను పరీక్షించేందుకు ఎన్‌‌ఎస్‌‌ఈ, బీఎస్‌‌ఈలు శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌‌ను నిర్వహించనున్నాయి