
- ఎమ్మెల్సీ కోదండరాం
- టీజేఎస్ ఆఫీస్లో తెలంగాణ విమోచన వేడుక
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యం కోసం, ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటంలో విజయం సాధించిన సందర్భంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటున్నామని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్లో ఆయన.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైన రోజని, ప్రజల పోరాట ఫలితంగా సాధించిన విజయంగా గుర్తించాలని అన్నారు.
1989లో తెలంగాణ చరిత్రపై అవగాహన పెంచేందుకు ‘మా తెలంగాణ’ అనే పత్రిక ఆవిష్కరణతో మొదలైన చర్చ.. తెలంగాణ రాష్ట్రం విలీనానికి సంబంధించిన చరిత్రపై ప్రజల్లో అవగాహన పెంచిందని, అప్పటి నుంచి సెప్టెంబర్ 17ను చర్చలోకి తెచ్చి, తెలంగాణా ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిపిందని కోదండరాం గుర్తు చేశారు.
అయితే సెప్టెంబర్ 17ని మత కోణంలో చూడటం కరెక్ట్ కాదని, ఆనాటి స్ఫూర్తితో ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం విజయవంతం కావడంలో పోలీస్ చర్య అనేది తుదిఘట్టం మాత్రమేనని, ఆ దిశగా జరిగిన ప్రజా ఉద్యమాల ప్రభావాన్ని మనం మరచిపోవద్దని సూచించారు. సెప్టెంబర్ 17ను జరుపుకోవడం అనేది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు చేసిన పోరాట స్ఫూర్తిని కొనసాగించడం తప్ప మరేమీ కాదని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్, పల్లె వినయ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.