సెరెనా విలియమ్స్కు వరుస ఓటములు

సెరెనా  విలియమ్స్కు వరుస ఓటములు

టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ మరోసారి ఓటమిపాలైంది. సిన్సినాటి మాస్టర్స్ తొలి రౌండ్ లోనే ఆమె ఇంటిముఖం పట్టింది. యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ఎమ్మా రదుకాను చేతిలో 4-6,0-6 స్కోరు తేడాతో సెరీనో ఓడిపోయింది. ఫస్ట్ సెట్లో 19 ఏళ్ల ఎమ్మాపై కాస్త పోరాడిన సెరెనా..రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేసింది.

దారుణ ఓటమి
కెనడా మాస్టర్స్‌లో ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌లోనే సెరెనా నిష్క్రమించింది. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లోనే ఆమె ఇంటిదారి పట్టింది. ​ 2–6, 4–6తో వరుస సెట్లలో బెలిందా బెన్సిచ్‌‌ (స్విట్జర్లాండ్‌‌) చేతిలో పరాజయం పాలైంది. జూన్ లో జరిగిన వింబుల్డన్‌-2022 టోర్నీలోనూ సెరెనా విలియమ్స్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ తొలి రౌండ్‌ పోటీల్లో ఓటమి చవిచూసింది. ఏడుసార్లు చాంపియన్‌గా నెగ్గిన సెరెనా ఫ్రాన్స్‌కు చెందిన వరల్డ్‌ నెంబర్‌ 115 క్రీడాకారిణి హర్మోనీ టాన్‌ చేతిలో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో ఓటమి తర్వాతే సెరెనా టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. వరుస ఓటముల నేపథ్యంలో ఈనెలాఖరులో ప్రారంభమయ్యే యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా ఏవిధంగా ఆడుతుందో చూడాలి.

మెద్వెదెవ్ ముందంజ..
సిన్సినాటి ఓపెన్లో ఒసాక (జపాన్‌) 4-6, 5-7తో షువాయి జంగ్‌ (చైనా) చేతిలో అనూహ్యంగా  ఓడిపోయింది.  కోకో గాఫ్‌ (అమెరికా) గాయం కారణంగా మ్యాచ్‌ మధ్యలో తప్పుకుంది. ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7-5, 6-1తో వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)పై గెలిచింది. మెన్స్ సింగిల్స్‌లో మెద్వెదెవ్‌ (రష్యా) మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. వరల్డ్ నెం.1 ప్లేయర్  రెండో రౌండ్లో 6-4, 7-5తో బోటిచ్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచాడు.