అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నరు..ఆస్తి కోసం కొందరు.. అనుమానాలతో ఇంకొందరు

అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నరు..ఆస్తి కోసం కొందరు.. అనుమానాలతో ఇంకొందరు
  • చిన్న చిన్న పంచాదులతో మరికొందరు..
  • రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దారుణాలు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బెట్టింగ్​ల జోలికి పోవద్దని బుద్ధి చెప్పినందుకు తండ్రి ప్రాణాలు తీశాడో కొడుకు. హత్య చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రించేందుకు ప్రయత్నించాడు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన నాలుగున్నర ఎకరాల్లో ఇద్దరు కొడుకులకు ఎకరంన్నర చొప్పున పంచి.. తన దగ్గర మరో ఎకరంన్నర ఉంచుకున్నాడో రైతు.  

ఆ భూమి మీద కన్నేసిన పెద్దకొడుకు.. దారి కాచి వెంటాడి వేటాడి తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు.  పదో తరగతి వయసులో ప్రేమలు వద్దని మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందో కూతురు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని పెండ్లయిన నెలకే భర్త ప్రాణాలు బలితీసుకున్నదో భార్య. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కడుపున పుట్టినవాళ్లే కాలయముళ్లవుతున్నారు.. తోడబుట్టినోళ్లే  తోడేళ్లవుతున్నారు.. కట్టుకున్నోళ్లే  కాటేస్తున్నారు. ఆస్తి కోసం కొందరు..  అనుమానాలతో మరికొందరు.. చిన్న చిన్న మనస్ఫర్థలతో ఇంకొందరు.. ఇట్లా కుటుంబ సభ్యులే తమ వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు.ఇలాంటి ఇన్సిడెంట్లు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబంలోని పెద్ద దిక్కును కోల్పోయిన ఎంతోమంది అనాథలవుతున్నారు. 

‘ఈజీ మనీ’కి అలవాటుపడి

రక్త సంబంధీకులను చంపేస్తున్న వాళ్లలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. బెట్టింగ్, మద్యంతో పాటు డ్రగ్స్, గంజాయికి బానిసలైన వారు ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో హత్యలకు తెగబడుతున్నారు. బెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల పేరుతో అప్పుల ఊబిలోకి చేరుకుని అందులో నుంచి బయటకు రావడానికి దారులు వెతుకుతున్నారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు తమకు అడ్డం వస్తున్నారని భావించి వారినే లేకుండా చేస్తున్నారు. క్షణికావేశంలో తల్లిదండ్రులపై దాడులకు తెగబడుతున్నారు. కొందరేమో ఆత్మహత్యలు చేసుకొని.. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ‘ఈజీ మనీ’ కోసం ఇంకొందరు తల్లిదండ్రులను హత్యలు చేస్తున్నారు.

పెంపకంలో లోపాలూ కారణమే..!

ప్రస్తుత బిజీ లైఫ్​లో తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై అంతగా శ్రద్ధ చూపడంలేదని అనేక సర్వేల్లో వెల్లడైంది. స్కూల్ స్టేజీ నుంచే పిల్లలకు ఏది మంచి? ఏది చెడు? అని చెప్పేవారు కరువయ్యారని.. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలతో కలిసి పిల్లలు గడిపే సమయం చాలా తక్కువ కావడంతో యువతలో అనుబంధాలపై అవగాహన లోపిస్తున్నదని సైకియాట్రిస్టులు అంటున్నారు. వీటికి తోడు పిల్లలు అడిగిందల్లా కొనివ్వడం వారికి వస్తువు విలువ తెలియకుండా పోతున్నదని చెప్తున్నారు. ‘‘ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లలో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా ఉండడంతో ప్రతి క్షణం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  యువత గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలు, బెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసలవుతున్నారు. సినిమాలు, బేకరీలతో మొదలైన ఎంజాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోజులో పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వీకెండ్  పార్టీల దాకా నడిపిస్తున్నాయి. ఇలా మద్యం, సిగరెట్లు, డ్రగ్స్, అశ్లీల చిత్రాలకు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బానిసలుగా మారుతున్నారు. ఇది ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నది” అని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు.  ‘నా జీవితం నా ఇష్టం’ అంటూ తల్లిదండ్రులను కూడా లెక్క చేయడం లేదని అంటున్నారు.

భూమి కోసం..!

సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం నాగయ్యగూడెంలో ఉండే వెంకన్న తాను  కష్టపడి సంపాదించిన నాలుగున్నర ఎకరాల్లో ఇద్దరు కొడుకులకు మూడెకరాలు పంచాడు. మిగిలిన ఎకరంన్నర అతడి పేరుపైనే పెట్టుకున్నాడు. ఈ భూమిపై కన్ను పడిన పెద్ద కొడుకు గంగయ్య.. తండ్రిని వేధించాడు. తాను బతికి ఉన్నంత వరకు ఆ భూమి తనపేరుపైనే ఉంటుందని వెంకన్న చెప్పాడు. ఆగ్రహంతో ఆ తండ్రిని దారి కాచి వెంటాడి వేటాడి నరికి చంపాడు గంగయ్య. 
పదో తరగతిలో ప్రేమేందన్నందుకు..?

తన ప్రేమకు తల్లి అడ్డుతగులుతున్నదని  ప్రియుడితో కలిసి పథకం పన్ని చంపేసిందో మైనర్​కూతురు. మహబూబాబాద్​ జిల్లా ఇనుగుర్తికి చెందిన అంజలి మేడ్చల్​ జిల్లా ఎల్​ఎల్​బి నగర్​ లో ఇద్దరు కూతుర్లతో కలిసి ఉంటున్నది. పదో తరగతి చదువుతున్న పెద్ద కూతురు.. తను ఒకరిని లవ్​చేస్తున్నట్లు తల్లికి చెప్పింది. ‘‘బిడ్డా.. నువ్వు ఇంకా పదో తరగతే..ఈ వయస్సులో ప్రేమ, గీమ అని పెట్టుకుంటే భవిష్యత్​ఆగమైతది. ఇది ప్రేమ కాదు ఆకర్షణ” అని తల్లి అంజలి మందలించింది. భరించలేక.. ప్లాన్​చేసి తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. తల్లి పూజ చేసుకుంటుండగా వెనకవైపు నుంచి చున్నీతో ఆమె  గొంతును ఇద్దరు నులిమి, ఆపై సుత్తెతో నుదుటిపై కొట్టారు. కొన ఊపిరితో ఉందని తెలుసుకుని కత్తితో గొంతు కోసి చంపేశారు.

బెట్టింగ్​ వద్దన్నందుకు..!

వనపర్తి జిల్లా ఘనపూర్​ మండలం కోతులగుట్టకు చెందిన హనుమంతు కుటుంబం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గచ్చిబౌలిలోని ఎన్టీఆర్​ నగర్​లో ఇద్దరు కొడుకులతో ఉంటున్నది. హనుమంతు కొడుకు రవీందర్​ విలాసాలు, బెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసయ్యాడు. ఆస్తిని బ్యాంకులో కుదువపెట్టి తండ్రి తెచ్చిన రూ. ఆరు లక్షలను రవీందర్​ బెట్టింగ్​లో పోగొట్టాడు. విషయం తెలుసుకున్న తండ్రి.. ‘ఈ బెట్టింగ్​తోని బాగుపడ్డోళ్లను చూసినవారా? పని చేసుకుంటెనే  బతికెటోళ్లం..కష్టపడి సంపాదించిన పైసలను గంగపాలు చేసినవ్​’ అని మందలించిండు. ఇప్పటికైనా మంచిగ పనిచేసుకో.. అని చెప్పిండు.  దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న ఆ కొడుకు.. నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.  

ఓటీటీల్లో వచ్చే హింసా కారణమే..!

టీనేజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్యంగా 19 నుంచి 25 ఏండ్ల మధ్య  వయస్సు ఉన్న యువతలో మానసిక సమతౌల్యం తక్కువ. ఇలాంటి వాళ్లు ఓటీటీల్లో వచ్చే హింసాత్మక కంటెంట్​చూడడం, ఆల్కహాల్​, మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల మంచి చెడుల విచక్షణ కోల్పోతారు. ఎవరికేమైతే నాకేంటి నేను మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.  తల్లిదండ్రులైనా..స్నేహితులైనా లెక్కచేయరు.  తమ ఆనందానికి, స్వేచ్ఛకు అడ్డువచ్చేవారిని చంపేందుకు సైతం వెనుకాడరు. ఈ క్రమంలో తప్పని తెలిసి కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. 
- డాక్టర్ హరిణి అట్టూరు, సైకియాట్రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎన్నో దారుణాలు

  • భార్య మీద అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు భర్త. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మెట్​పల్లికి చెందిన ముడిమడుగుల తిరుపతికి 14 ఏండ్ల కింద పెండ్లయింది. వారికి ఐదేండ్ల పాప ఉంది. తిరుపతికి భార్యపై అనుమానం ఉండేది. గురువారం మంచంలో పడుకున్న తులసిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. 
  • తీసుకున్న అప్పును తీర్చమన్నందుకు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బ్రహ్మణ్​పల్లికి చెందిన జిన్న లక్ష్మి (50) ని ఆమె అల్లుడు బాలరాజు గురువారం కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.  స్కూల్​లో మిడ్​డే మిల్స్​ వండి ఇంటికి వెళ్తున్న లక్ష్మిని బాలరాజు మధ్యలో ఆపి గొడవ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దారుణానికి ఒడిగట్టాడు. 
  • నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరులో గుర్రం అంజమ్మ(75) ను కోడలు ఈ నెల 2న చంపేసింది. అంజమ్మకు ఇద్దరు కొడుకులు. ఆస్తి పంపకాల విషయంలో కొడుకులిద్దరి మధ్య వివాదం నడుస్తున్నది. రెండు రోజుల కింద జరిగిన గొడవలో అంజమ్మను కోడలు పార్వతమ్మ కట్టెతో కొట్టి చంపింది.  
  • గద్వాల జిల్లా అయిజ మాల పేటలో ఉంటున్న వడ్ల సరోజ (45) ను ఆమె భర్త రామాచారి, కొడుకు వినోదాచారి కలిసి ఈ నెల 1న గొంతు నులిమి హత్య చేశారు. సరోజ, రామాచారి చాలాకాలం కింద విడిపోయి దూరంగా ఉంటున్నారు. సరోజ ప్రవర్తన సరిగా లేకపో వడంవల్ల కొడుకుకు పెండ్లి కావడంలేదన్న ఉద్దేశంతో తండ్రి, కొడుకు కలిసి సరోజను 
  • హత్య చేశారు. 
  •        సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన నవీన్ గౌడ్ కుటుంబ కలహాల కారణంగా జూన్​ 28న తన భార్య రమ్య (28), ఇద్దరు కూతుర్లను  మెదక్ జిల్లా కోర్టు బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో రమ్య మృతి చెందగా.. ఇద్దరు కూతుళ్లు రుత్విక, యశ్విక తీవ్రంగా గాయపడ్డారు.
  •     జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల టౌన్ గంట గేరికి చెందిన తేజేశ్వర్ (30)ను భార్య ఐశ్వర్య ప్రియుడు తిరుమల్ రావుతో కలిసి సుపారి గ్యాంగ్ తో జూన్​ 17న హత్య చేయించింది. పెండ్లయిన నెలకే వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించింది.  
  •     డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ పడిన కొడుకు.. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమె 3 రోజుల తర్వాత చనిపోయింది. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లికి ముత్తినేని సాంబయ్య, వినోద  టెక్స్​టైల్​ పార్క్​ కింద భూమి కోల్పోగా వచ్చిన డబ్బుల గురించి కొడుకు సతీశ్​ గొడవ పడుతున్నాడు. డబ్బులు తనకు కాకుండా కూతురికి ఇస్తారని భావించిన సతీశ్..​ జూన్​ 28న గొడవ పెట్టుకున్నాడు. తెల్లవారుజామున వినోదపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. 
  •     నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం పెంటఖుర్థు గ్రామానికి చెందిన చంద్రకళ (59) భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నది. మహారాష్ట్రలో తండ్రితో ఉంటున్న ఇద్దరు కొడుకులు, కూతురు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు. జూన్ 23న వచ్చిన చిన్న కొడుకు సురేశ్..​ తల్లి ఒంటి మీద నగలు ఇవ్వాలని అడగ్గా ఆమె ఒప్పుకోలేదు. రాత్రి తాగి ఇంటికి వచ్చిన కొడుకు.. తల్లిని గొడ్డలితో నరికి మూడు తులాలు బంగారు గొలుసు, 50 తులాల వెండి కడియాలతో పారిపోయాడు.