‘రెగ్యులరైజేషన్’ కోసం సెర్ప్ ఉద్యోగుల ఎదురుచూపులు

‘రెగ్యులరైజేషన్’ కోసం సెర్ప్ ఉద్యోగుల ఎదురుచూపులు
  • సెర్ప్‌‌‌‌లో సిబ్బంది, అధికారులు.. అంతా కాంట్రాక్టు ఉద్యోగులే
  • పది, పదిహేనేళ్లకుపైగా ఇదే పరిస్థితి
  • అమలుకాని సీఎం కేసీఆర్‌‌‌‌ ఎలక్షన్​ హామీలు
  • నాలుగున్నర వేల మంది ఎదురుచూపులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, ఉపాధి కల్పనలో తోడ్పడుతున్న ‘గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌‌‌‌)’లో ఉద్యోగులు ఆందోళనలో మునిగిపోయారు. కాంట్రాక్ట్‌‌‌‌ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్​ చేయాలని, వేతనాలు పెంచాలని.. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో సెర్ప్​ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఎక్కువ జీతాలు ఇస్తోందని, మన రాష్ట్రంలో మాత్రం వేతనాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తంగా సెర్ప్​ కింద 4,259 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో పదేళ్లకు పైగా పనిచేస్తున్న వారే సగం మంది ఉన్నారు.

పదేళ్లుగా నిరీక్షణ

ఉమ్మడి ఏపీలోని ఆరు జిల్లాల్లో 2000లో ‘వెలుగు’ పేరిట మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు పైలట్‌‌‌‌ ప్రాజెక్టును చేపట్టారు. అందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలు ఉన్నాయి. తర్వాత 2002లో ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించారు. 2004లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకం పేరును ‘ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)’గా మార్చింది. 2014లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక దీనిని ‘గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్‌‌‌‌)’గా మార్చారు. ప్రాజెక్టు ప్రారంభమైన 2002 నుంచి (17 ఏళ్లుగా) ఉద్యోగం చేస్తున్నవారు సహా ఇప్పటివరకు ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిలోనే పనిచేస్తున్నారు. 2009 ఎలక్షన్ల సందర్భంగా ‘సెర్ప్’ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేస్తామని ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్​రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఆయన కొద్దినెలలకే మరణించడంతో హామీ అమలుకు నోచుకోలేదు. ఉద్యమం సందర్భంగా, తొలి ఎలక్షన్ల సమయంలో టీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ తెలంగాణలో ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగాలు ఉండవని, వారిని రెగ్యులరైజ్‌‌‌‌ చేస్తామని పలుమార్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చినా రెగ్యులరైజేషన్‌‌‌‌ జరగలేదు. కొంత మేర వేతనాలు పెంచారు. మిగతా ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను ఏడాదికోసారి రెన్యూవల్‌‌‌‌ చేస్తుండగా.. సెర్ప్‌‌‌‌ ఉద్యోగుల కాంట్రాక్ట్‌‌‌‌ను ఐదేళ్లకోసారి రెన్యూవల్‌‌‌‌ చేస్తున్నారు. ఇది సానుకూలమే అయినా.. తాము రిటైరయ్యే వరకు కాంట్రాక్టు ఉద్యోగులుగానే కొనసాగాల్సి వచ్చేలా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వీస్‌‌‌‌ రెగ్యులర్‌ చేయాలి

సెర్ప్‌‌‌‌లో పదిహేనేళ్లకు పైగా పనిచేస్తున్నవారు ఉన్నారు. అంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారే. మమ్నల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చాలా కాలంగా పోరాడుతున్నాం. గవర్నమెంట్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌తో సమానంగా పని చేస్తూ.. ప్రభుత్వ పథకాలను కింది స్థాయికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌‌‌‌ ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతున్నాం. – కుంట గంగాధర్‌‌‌‌ రెడ్డి,  సెర్ప్‌‌‌‌ ఉద్యోగుల జేఏసీ నేత