5 ఏళ్లలో ఏడున్నర లక్షలమంది కోటీశ్వరులు

5 ఏళ్లలో ఏడున్నర లక్షలమంది కోటీశ్వరులు

హైదరాబాద్‌‌, వెలుగు : ఇండియా  5 ట్రిలియన్‌‌ డాలర్ల ఎకానమీగా మారే క్రమంలో రాబోయే 5 ఏళ్లలో 7.5 లక్షల మంది కొత్త మిలియనీర్లు తయారవుతారని కార్వీ ప్రైవేట్‌‌ వెల్త్‌‌ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వ్యక్తుల సంపద ఇప్పుడున్న రూ. 430 లక్షల కోట్ల నుంచి రూ. 799 లక్షల కోట్లకు చేరుతుందని కార్వీ విడుదల చేసిన ఇండియా వెల్త్‌‌ రిపోర్ట్‌‌ 2019 చెబుతోంది. ఫైనాన్షియల్‌‌ ఎసెట్స్‌‌ మక్కువ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోందని, ఈక్విటీ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌, మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ రాబోయే అయిదేళ్లలో భారీగా పెరుగుతాయని పేర్కొంటోంది. 2018 తో పోలిస్తే 2019 లో ఫైనాన్షియల్‌‌ ఎసెట్స్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ పెట్టిన వ్యక్తుల సంపద 10.96 శాతం పెరిగిందని కార్వీ రిపోర్టు వెల్లడించింది. 5 ట్రిలియన్‌‌ డాలర్ల ఎకానమీగా అవతరించడానికి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌, గ్రీన్‌‌ ఎనర్జీలలో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం నడుం బిగించిందని, నియంత్రణాపరమైన సహకారానికి సంసిద్ధత కనబరుస్తుండటంతోపాటు, పన్నుల విధానాలలో సంస్కరణలు చేపట్టనుందని పేర్కొంది. పనిచేసే యువతరం ఎక్కువగా ఉండటంతో కన్సంప్షన్‌‌ ఊపందుకుంటే 5 ట్రిలియన్‌‌ డాలర్ల ఎకానమీగా మారడం కష్టసాధ్యం కాబోదని కార్వీ రిపోర్టు అభిప్రాయపడుతోంది.

తెలంగాణలో రియల్‌‌బూమ్‌‌…

రియల్‌‌ ఎస్టేట్‌‌, బంగారాలలో పెట్టుబడులంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని, ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లు కూడా వారి దృష్టిని ఆకట్టుకుంటున్నాయని, ఆ తర్వాత ప్లేస్‌‌లోనే ఈక్విటీ, మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ ఉంటున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌‌లో రియల్‌‌ ఎస్టేట్‌‌ గత అయిదేళ్లలో అద్భుతమైన ప్రతిఫలాలను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టినట్లు పేర్కొంది. 2014–2019 మధ్య కాలంలో హైదరాబాద్‌‌ రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు భారీగా పెరిగాయని, మరీ ముఖ్యంగా ఒక్క 2019 ఆర్ధిక సంవత్సరంలోనే ఈ పెరుగుదల 21.94 శాతంగా నమోదైందని వివరించింది. భద్రతపరంగా బంగారం, రియల్‌‌ ఎస్టేట్‌‌ రంగాలలో పెట్టుబడులకే తెలంగాణ వాసులు ఓటు వేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో డిపాజిట్లు (కరెంట్‌‌, సేవింగ్స్‌‌, ఫిక్స్‌‌డ్‌‌) కూడా జూన్‌‌ 2018 తో పోలిస్తే జూన్‌‌ 2019 నాటికి 9.67 శాతం పెరిగి రూ. 4,62,234 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఒక్క హైదరాబాద్‌‌లోనే ఈ కాలంలో 9.46 శాతం పెరిగి రూ. 2,70,077 కోట్లకు చేరాయని తెలిపింది.