ఏడు వేల టీచర్​ పోస్టులు గల్లంతు!

ఏడు వేల టీచర్​ పోస్టులు గల్లంతు!
  • రేషనలైజేషన్‌‌కు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: ఏడు వేల టీచర్ పోస్టులకు రాష్ట్ర సర్కారు ఎసరు పెడుతోంది. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయిస్తామని చెప్తూ రేషనలైజేషన్ ప్రక్రియకు తెరతీసింది. కొంతకాలంగా స్టూడెంట్లు లేని స్కూళ్లలోని పోస్టులను పూర్తిగా రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది. టీచర్ల రేషనలైజేషన్​తో పాటు కొత్త జిల్లాలకు కేటాయింపులు చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందుకే భర్తీ చేస్తలే
రాష్ట్రంలో 26,065 గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 19.84 లక్షల మంది స్టూడెంట్లు చదువుతుండగా.. 1.08 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. స్టూడెంట్ల సంఖ్యతో పోలిస్తే టీచర్లు ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం కొంతకాలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. శాంక్షన్డ్ పోస్టులతో పోలిస్తే 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రానికి ప్రభుత్వం మూడు నెలల క్రితమే చెప్పింది. కానీ శాంక్షన్డ్ పోస్టుల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​లోనే 9,221 పోస్టులు ఎక్సెస్ ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే రేషనలైజేషన్ చేస్తామని తెలిపింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైమరీ స్కూళ్లలో టీచర్ స్టూడెంట్ రేషియో 1:30, అప్పర్ ప్రైమరీలో 1:35, హైస్కూల్​లో 1:40 ఉండాలి. ప్రస్తుతం ప్రైమరీలో 1:17, అప్పర్ ప్రైమరీలో 1:14, హైస్కూళ్లలో 1:18 ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కారణం వల్లే టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదనే వాదనలున్నాయి. ఇప్పటిదాకా 12 వేల మంది విద్యా వాలంటీర్లను కూడా రెన్యువల్ చేయలేదు.

వారం రోజుల్లో జీవో
తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో తొలిసారిగా టీచర్ల రేషనలైజేషన్ నిర్వహించారు. ఇందుకోసం అప్పట్లో జీవో 11, 17 రిలీజ్ చేశారు. ఇప్పుడు నిర్వహించబోయే రేషనలైజేషన్‌‌కూ జీవో నంబర్ 11 ప్రకారమే ముందుకెళ్లాలని సర్కారు భావిస్తోంది. దీనికి అనుగుణంగానే మరో జీవోను వారం రోజుల్లో సర్కారు ఇచ్చే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. టీచర్ల రేషనలైజేషన్​కు రెడీగా ఉండాలనీ, లెక్కలన్నీ సిద్ధం చేసుకోవాలని డీఈఓలను రెండు రోజుల కింద స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. 2020–21 యూడైస్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రస్తుతం ఆఫీసర్లంతా అదే పనిలో నిమగ్నమయ్యారు. జీవో నంబర్ 11 ప్రకారం ఏ స్కూల్ కు ఎన్ని పోస్టులు అవసరమో అన్ని మాత్రమే కేటాయించనున్నారు. ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న పలు సబ్జెక్టు టీచర్ పోస్టులను.. అవసరాలకు అనుగుణంగా టీచర్ల బీఈడీలోని కేటగిరీ ఆధారంగా కేటాయించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్​లోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఒకే స్కూల్ ఆవరణలో ఒకే లెవెల్ బడులుంటే వాటిని క్లబ్ చేయనున్నారు. రాష్ట్రంలో 1,243 జీరో ఎన్‌‌రోల్​మెంట్ స్కూళ్లుండగా, వాటిలో 1,732 మంది టీచర్లున్నట్టు అధికారిక లెక్కల్లో చూపిస్తున్నారు. ఈసారి ఈ పోస్టులన్నీ రద్దు చేయాలని యోచిస్తున్నారు.

ఖాళీలే ఉండవు
స్టేట్​లో 1.08 లక్షల మంది టీచర్లున్నారు. 6 వేల ఎస్జీటీ పోస్టులు, 8,150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,970 హెడ్‌‌మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ రేషనలైజేషన్‌‌తో నిండిపోనున్నాయి. ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తే 13 వేల దాకా ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశముందని టీచర్ల యూనియన్ నేతలు చెప్తున్నారు. వీటిలో ఐదున్నర వేల పోస్టుల దాకా ప్రైమరీ హెడ్‌‌మాస్టర్ పోస్టులకు కన్వర్ట్ చేసి, మిగిలిన 7 వేలపైగా పోస్టులను డీఈఓ పోల్​లో పెట్టే ఆలోచనలో అధికారులున్నట్టు తెలుస్తోంది. అంటే ఆ 7 వేల పోస్టులు ఇక ఉండవని టీచర్స్ యూనియన్లు చెప్తున్నాయి. 2015లో జరిగిన టీచర్ల రేషనలైజేషన్​లోనూ 6 వేల పోస్టులు డీఈఓ పోల్​లో పెట్టగా, వాటి ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం 50 వేల పోస్టుల ఖాళీల వివరాలు ప్రకటించగా, వాటిలో సెకండరీ ఎడ్యుకేషన్​లో 1,384 పోస్టులే ఖాళీగా ఉన్నట్టు చూపించింది. రేషనలైజేషన్ జరిగితే ఆ 1,384 పోస్టులు భర్తీ చేయడం కూడా అనుమానమే.

ప్రైమరీలో ఇబ్బందే
ప్రతి సారి స్కూల్ యూనిట్ ఆధారంగానే టీచర్, స్టూడెంట్ రేషియో ప్రకారం రేషనలైజేషన్ చేస్తున్నారు. ప్రైమరీ లెవెల్​లో ప్రతి 30 మందికి ఒక టీచర్, 60 మందికి ఇద్దరు టీచర్లుండాలి. ఈ లెక్కన ఐదు క్లాసులను ఇద్దరు టీచర్లే బోధించాల్సి ఉంటుంది.