సినిమా స్టైల్లో యాక్సిడెంట్: హైవేపై వరుసగా ఢీకొన్న వాహనాలు.. ఇద్దరు మృతి.. 25 మందికి గాయాలు

సినిమా స్టైల్లో యాక్సిడెంట్: హైవేపై వరుసగా ఢీకొన్న వాహనాలు.. ఇద్దరు మృతి.. 25 మందికి గాయాలు

చంఢీఘర్: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోహ్‌తక్ జిల్లాలోని ఖర్కారా గ్రామ సమీపంలో జాతీయ రహదారి 152పై ట్రక్కులు, బస్సులు, కార్లు సహా అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా.. కనీసం 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనలో పలు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్రేన్ల సహయంతో వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి వాహనాల రద్దీని క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

అంబాలాను నార్నాల్‌కు అనుసంధానించే హైవే 152D పై ఆదివారం (డిసెంబర్ 14) ఉదయం 8 గంటల ప్రాంతంలో బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 10 నుంచి12 వాహనాలు వరుసగా ఢీకొన్నాయని చెప్పారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని చికిత్స కోసం పీజీఐ రోహ్‌తక్‌లో చేర్చామని తెలిపారు. దట్టమైన పొగ మంచు  కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని వెల్లడించారు.