మీలోనూ ఈ లక్షణాలున్నాయా.. అయితే అస్సలు పెళ్లి చేసుకోవద్దు..

మీలోనూ ఈ లక్షణాలున్నాయా.. అయితే అస్సలు పెళ్లి చేసుకోవద్దు..

పెళ్లి అంటే అందరికీ ఒకే రకమైన ఫీలింగ్ ఉండదు. కొందరికి చిరకాల వాంఛ అయితే, మరికొందరికి తప్పని పరిస్థితి. ఇంట్లో వాళ్లు చెప్పారనో, లేదంటే వయసు పైబడుతుందని భయపడో ఎవరో ఒకర్ని చేసుకోవాలని పెళ్లి చేసుకుంటుంటారు మరి కొంతమంది. అలా చేయడం వల్ల జీవితంలో సర్దుకుపోవడం తెలిసిన కొందరు.. కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. ఉన్నదాంట్లోనే సంతృప్తి పడుతుంటారు. కానీ మరికొందరు మాత్రం తాము కోరుకున్న లైఫ్ అది కాదని, ఉన్నది ఒక్కటే జిందగీ.. సో.. ఈ అడ్జస్ట్ మెంట్స్, అండర్ స్టాండింగ్స్ నాకెందుకు అనుకునే వాళ్లు మాత్రం ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. ఎప్పుడెప్పుడు ఆ బంధం నుంచి బయటపడదామా అని చూస్తుంటారు. వీలైనంత తొందరగా విడాకులు తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటారు.

దీన్ని పక్కన పెడితే.. మన ఆలోచన, వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుని అసలు పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది నిర్ధారించుకోవాలి. మీ జీవితంలోకి వచ్చే పర్సన్ మీలా ఉంటారని లేదు కదా. అప్పుడు వారి జీవితం నాశనం చేసిన వారవుతారు. అలాంటి నష్టాలేమీ జరగకుండా ఉండాలంటే.. మీకున్న లక్షణాలను బట్టి మీరు పెళ్లి చేసుకోవాలా.. వద్దా అనేది నిర్ణయించుకోవాలి. అందులో కొన్ని లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.

వృథా ఖర్చు అనుకుంటున్నారా..

పెళ్లి, నిశ్చితార్థం లాంటివి ఈ రోజుల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్నవిగా మారాయి. దాని కోసం ఆస్తులను సైతం అమ్ముకునే పరిస్థితి. జీవితాంతం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ఒక్క రోజు కోసం ఖర్చు చేయాలా అన్న భావన కొందరికి ఉంటుంది. అలాంటి ఆలోచన ఉంటే, ఆర్థిక స్థోమత లేదు అనుకుంటే పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటర్. లేదంటే భవిష్యత్తులో.. ఆ రోజు గుర్తొచ్చినప్పుడల్లా తప్పు చేశామనే భావన కల్గుతుంది. అది జీవితాంతం అలానే ఉంటుంది.

ఇంకొకరికి విలువ ఇవ్వాలా అనుకుంటున్నారా..

పెళ్లయితే ఒకరి నిర్ణయాలకు, సలహాలకు మర్యాద, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అలాంటప్పుడే ఆ బంధం మరింత బలపడుతుంది. అలా కాకుండా నా నిర్ణయమే ఉండాలి.. నేను చెప్పిందే జరగాలన్న ధోరణి మీకుంటే అస్సలు పెళ్లి చేసుకోకండి. దాని వల్ల అవతలి వాళ్లు ఎంత ఇబ్బంది పడ్తారో కొన్నిసార్లు మీరు కనీసం ఊహించలేరు. అప్పుడు మీకు తెలియకుండానే ఇంకొకర్ని వేధించినవాళ్లవుతారు.

ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా..

కొందరికి ఒంటరిగా ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టం. పెళ్లయితే అలాంటివి కుదరవు. భార్య, పిల్లలు అంటూ కుటుంబంలో కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు. వారందర్నీ మేనేజ్ చేసే స్థోమత ఉందనుకుంటేనే పెళ్లి చేసుకోండి. మీలో మీరే, మీకే మీరు అని ఉంటే.. మీ కుటుంబం మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. వెళ్లిపోయిన ఆ క్షణాలను వాళ్లకు మళ్లీ తెచ్చివ్వలేం కదా.

స్వేచ్ఛ కోల్పోతామనుకుంటున్నారా..

చాలా మంది వివాహం అంటే స్వేచ్ఛను కోల్పోవడం అని భావిస్తూ ఉంటారు. పెళ్లయితే మనకంటూ సొంత ఇష్టాలుండవు, మనం చెప్పింది ఏదీ జరగదు అన్న ఆలోచనతో ఉంటారు. అలాంటి వారు వివాహ బంధానికి దూరంగా ఉంటే మంచిది. దీన్నే కమిట్‌మెంట్-ఫోబిక్ అంటారు.

మార్పును అంగీకరించరా..

పెళ్లి అంటే ముందుగా మొదలయ్యేది మార్పే. అమ్మాయిలకైతే ముఖ్యంగా ఇంటిపేరు, ఇల్లుతో పాటు సాంప్రదాయాలు, ఆచారాలు, కుటుంబం.. ఇలా అన్నీ మారాల్సి ఉంటుంది. కొందరికి అది నచ్చదు. అలా మీ కుటుంబాన్ని విడిచి వెళ్లాలని లేకపోవడం, ఇతరులతో రాజీ పడి ఉండడం వంటివి దీర్ఘ కాలంలో మీకే కాదు.. అది ఇతరులకూ ఇబ్బందిగా మారుతుంది. సో పెళ్లికి ముందే ఈ విషయాలపై క్లారిటీ తెచ్చుకుంటే మంచిది.

ఖర్చులు భరించలేమనుకుంటున్నారా..

పెళ్లితో ఒకరు లైఫ్ లో రావడమే కాదు.. వారితో పాటు ఖర్చులూ వెంట వస్తాయి. అవి రోజురోజుకూ పెరుగుతాయే కానీ.. తగ్గవు. పిల్లలు, వారి చదువు, ప్రయాణాలు.. లాంటి ఎన్నో ఖర్చులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ భరించలేమనుకుంటే పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం.

జీవితాంతం వాళ్లతోనేనా.. అనే భావన ఉందా..

పెళ్లి చేసుకుంటే కష్టమైనా, సుఖమైనా జీవితాంతం వారితోనే కలిసి ఉండాలి. కొంతమందికి అలా ఇష్టముండదు. డేటింగ్ లాంటివి అంటే ఇష్టపడడం వల్ల వివాహ వ్యవస్థపై అంత నమ్మకముండదు. ఉన్నది ఒక్కటే జీవితం. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి.. అంతే గానీ ఎంత కష్టమైనా వాళ్లతోనే ఉండాలంటే కష్టమని భావించేవాళ్లు పెళ్లిని ఒక బాధ్యతగా కాకుండా సంకెళ్లుగా భావించవచ్చు. సో ఈ తరహా ఆలోచనలున్నా పెళ్లి మానుకుంటే బెటర్.

పిల్లలంటే నచ్చదా..

కొందరికి పిల్లలంటే ఇష్టముండకపోవచ్చు. వాళ్లను పెంచడం, ఆలనా పాలనా చూసుకోవడం వంటివి నచ్చకపోవచ్చు. ఇలాంటి వాళ్లు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.

ఇవే కాదు.. పెళ్లి అంటే ఒక్కొక్కరిలో ఒక్కో భావన ఉంటుంది. పెళ్లి అనే బంధంలోకి వెళ్లి మీకు నచ్చినట్టు ఉండలేక, ఇతరులకు నచ్చింది చేయలేక నిత్యం కుమిలిపోయే బదులు.. సోలో లైఫే సో బెటర్ అని మీకనిపిస్తే.. బ్యాచిలర్ లైఫ్ కే ఓటెయ్యడం చాలా మంచిది. ఎందుకంటే ఆత్మ సంతృప్తిని మించింది మరొకటి లేదు. అదే లేకపోతే జీవితంలో ఏం చేసినా వ్యర్థమే. పెళ్లి అంటే జీవితంలో తప్పక జరగాల్సిన ప్రక్రియేం కాదు. ఎవరో చెప్పారనో, ఏదో అవుతుందనో ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ తర్వాత సాగే జీవితం.. అసలు నా జీవితమేంటీ ఇలా అయిపోయింది అన్న ప్రశ్నకు మీరు కూడా సమాధానం చెప్పలేరు. ముందు చెప్పినట్టు ఉన్నటి ఒక్కటే జీవితం. అది ఎవరికైనా...