చలిపెరిగింది..రాష్ట్ర వ్యాప్తంగా15 డిగ్రీలలోపే నైట్ టెంపరేచర్లు

చలిపెరిగింది..రాష్ట్ర వ్యాప్తంగా15 డిగ్రీలలోపే నైట్ టెంపరేచర్లు
  • అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో 10.8 డిగ్రీలు
  • ఎండపూట కూడా వణికిస్తున్న చలి 
  • రాష్ట్రంలో 3 రోజులు ఎల్లో అలర్ట్     
  • ఈ వింటర్ అంతా ఇట్లే ఉండొచ్చు: ఐఎండీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నైట్ టెంపరేచర్లు15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది.

ప్రత్యేకించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తున్నది. మొత్తంగా 30 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరో మూడు (ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట) జిల్లాల్లో నైట్ టెంపరేచర్లు15 నుంచి16 డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్​లోని సిర్పూర్​లో10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు చలి తీవ్రతపై ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువగానే (30 నుంచి 33 డిగ్రీల మధ్య) నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఇటు హైదరాబాద్​లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్, పటాన్​చెరు, హయత్​నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 15 డిగ్రీల కన్నా తక్కువగా రాత్రి టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. అత్యల్పంగా రాజేంద్రనగర్​లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. సిటీలోని మిగతా ప్రాంతాల్లోనూ18 డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, ఈ చలికాలం అంతా రాత్రి ఉష్ణోగ్రతలు ఇదే రేంజ్​లో నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. పగటి టెంపరేచర్లు కూడా సాధారణం కన్నా తక్కువకు పడిపోయే చాన్స్ ఉన్నాయని పేర్కొంది.   

వానలు అసాధారణం 

ఈ ఏడాది వర్షపాతం అసాధారణంగా నమోదైనట్టు తెలంగాణ స్టేట్​ డెవలప్​మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్​డీపీఎస్) వెల్లడించింది. ఓవరాల్​గా వర్షపాతం సాధారణం కన్నా కొంచెం ఎక్కువగానే నమోదైందని రిపోర్ట్​లో పేర్కొన్నా.. నెలలవారీగా చూస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 849.7 మిల్లీమీటర్లుగా అంచనా వేయగా.. ఇప్పటివరకు 913.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.

జూన్​లో 44 శాతం, ఆగస్టులో 63 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. జులైలో 114 శాతం, సెప్టెంబర్​లో 34 శాతం చొప్పున సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురిసిందని తెలిపింది. ఈశాన్య రుతుపవనాలతో కురవాల్సిన వర్షాల కన్నా 53 శాతం తక్కువ వర్షపాతమే నమోదైందని వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలతో అక్టోబర్​లో 89.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్నా.. 93 శాతం లోటుతో కేవలం 6.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసినట్లు చెప్పింది.

జిల్లాలవారీగా నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు 

ఆసిఫాబాద్ 10.8 డిగ్రీలు, ఆదిలాబాద్ 11.1, రంగారెడ్డి 11.2, సంగారెడ్డి 11.3, వికారాబాద్11.6, మహబూబ్​నగర్ 12, సిద్దిపేట12.4, యాదాద్రి 12.4, నిర్మల్ 12.5, కామారెడ్డి 12.5, సిరిసిల్ల 12.6, మంచిర్యాల 12.6, నిజామాబాద్ 12.8, జగిత్యాల12.8, జనగామ 12.9, నల్గొండ 13, వరంగల్13.1, భూపాలపల్లి 13.1, మేడ్చల్ 13.2, మెదక్13.2, హనుమకొండ 13.2, పెద్దపల్లి 13.4, ములుగు13.4, కరీంనగర్13.6, నారాయణపేట13.8, మహబూబాబాద్13.8, నాగర్​కర్నూల్14, గద్వాల14.3, హైదరాబాద్14.8, ఖమ్మం15.2, సూర్యాపేట15.5, వనపర్తి 15.9 డిగ్రీలు. 

వర్షం పడ్డ రోజులు తక్కువ

ఈ ఏడాది వర్షం కురిసిన రోజులు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. సాధారణ వర్షపాతమే నమోదైనా.. సీజనంతా (దాదాపు ఐదు నెలల్లో) కురవాల్సిన వర్షం కేవలం ఒకటిన్నర నెలలోనే కురిసిందని అంటున్నారు. సీజన్​లో ఎక్కువ రోజుల పాటు వర్షాలు కురిస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. ప్రాజెక్టులు నిండుతాయి. కానీ ఈ సారి ఆ పరిస్థితులు కనిపించలేదు. ఒకేసారి పెద్ద పెద్ద వర్షాలు కురవడంతో ఏడాదంతా నమోదవ్వాల్సిన వర్షపాతం అతి తక్కువ రోజుల్లోనే నమోదైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క రాత్రిలోనే దాదాపు 44.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షాలు పడకపోవడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు సమృద్ధిగానే ఉన్నా.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్​స్టోరేజీకి పడిపోయింది. దీంతో ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీళ్లను వదలాల్సి వచ్చింది.