ఆడపిల్ల అని తేలితే సీక్రెట్ గా అబార్షన్లు

ఆడపిల్ల అని తేలితే సీక్రెట్ గా అబార్షన్లు

ఖమ్మంలోని రమణగుట్టకు చెందిన ఒక బాలిక, స్థానికంగా ఉండే యువకుడు ప్రేమించుకుని శారీరకంగా ఒక్కటవ్వడంతో  బాలికకు ప్రెగ్నెన్సీ వచ్చింది. యువకుడు అమ్మాయి ఇంట్లో విషయం తెలియకుండానే, నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. బీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి అప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. భార్య మళ్లీ ప్రెగ్నెంట్​కావడంతో  ఓ స్కానింగ్ సెంటర్​కు తీసుకెళ్లాడు. మళ్లీ  పాప అని చెప్పడంతో  రూ.20 వేలు ఖర్చు చేసి భార్యకు అబార్షన్​ చేయించాడు. ఈ రెండు ఘటనల్లోనూ ఆర్ఎంపీ డాక్టర్లే మధ్యవర్తిగా వహించారు. ​

ఖమ్మం, వెలుగు: హెల్త్ ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం, ఆస్పత్రి నిర్వాహకుల కాసుల వేటతో ఖమ్మం సిటీలో రూల్స్​ కు వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు కామన్​ అయ్యాయి. సందుకో స్కానింగ్ సెంటర్​ ఏర్పాటు చేసి కావాల్సిన పైసలు చేతిలో పెడితే చాలు కడుపులో ఉన్న బిడ్డను ఆడనో, మగనో చెప్పేస్తున్నారు. ఇష్టంలేని వారు కడుపులోనే పిండాలను  కరగదీస్తున్నారు.  ఇటీవల డీఎంహెచ్​వో మాలతి ఆకస్మికంగా నగరంలోని రిలీఫ్ ఆస్పత్రిని తనిఖీ చేయగా, అక్కడ అబార్షన్​ చేయించుకున్న మహిళ ఉండడాన్ని గుర్తించారు. ఎంక్వైరీ చేయగా స్కానింగ్ లో అమ్మాయని తెలియగా అబార్షన్ చేసినట్లు తేలడంతో హాస్పిటల్​ ను సీజ్​ చేశారు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మాత్రమే బయటపడగా, వందల సంఖ్యలో ఉన్న ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో అబార్షన్​ లు గుట్టుగా జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. 

గతంలో పెద్ద ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో మాత్రమే తల్లి గర్భంలోని శిశువును పరీక్షించేందుకు స్కానింగ్​ మిషన్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీతో  పోర్టబుల్ సైజ్​ స్కానింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.30 లక్షలు ఖర్చు చేస్తే కాలేజీ  స్టూడెంట్లు వేసుకునే బ్యాగ్ సైజ్ లో, ల్యాప్​ టాప్​ లా ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లేలా కొత్త మిషన్లు ఉండడం ఆర్ఎంపీ డాక్టర్లకు, ప్రైవేట్‌‌‌‌ఆస్పత్రి నిర్వాహకులకు వరంగా మారింది. నగరంలో ఆస్పత్రులు ఎక్కువగా ఉండే మెయిన్​ సెంటర్లలో ప్రత్యేకంగా రూమ్​ అద్దెకు తీసుకొని, అక్కడికి వచ్చిన వాళ్లకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి రిజల్ట్ చెబుతున్నారు. అక్కడికి రాలేని వాళ్ల ఇళ్లకు వెళ్లి కూడా ఆస్పత్రి పీఆర్వోలు స్కానింగ్ చేస్తున్నారు. డీల్ సెట్ అయితే ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్లు చేయిస్తున్నారు. రూ.20 వేల నుంచి 25 వేల వరకు ఉన్న ఈ ప్యాకేజీలో పేషెంట్లను తీసుకువచ్చిన ఆర్ఎంపీలకు రూ.5 వేలు,పీఆర్వోలు, స్కానింగ్ చేసిన వారు, ఆస్పత్రి నిర్వాహకులు కలిసి మిగిలిన డబ్బులు పంచుకుంటున్నారు. ఒక్కో పీఆర్వో కనీసం రోజుకు 8 నుంచి 10 వరకు ఇలా సీక్రెట్ అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

నగరంలో ఎక్కువగా బోనకల్లు రోడ్డులో కొత్తగా ఏర్పాటుచేసిన ఒక ఆస్పత్రి, సీసీఎస్ పోలీస్​ స్టేషన్​ లోని ఒక ఆస్పత్రి, ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ లోని మరో హాస్పిటల్​, పెవిలియన్​ గ్రౌండ్​ సమీపంలోని ఇంకో హాస్పిటల్, మయూరిసెంటర్​ లోని మరో ఆస్పత్రి తో పాటు నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రత్యేకంగా ఈ అబార్షన్లనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇక నెలలు మించి అబార్షన్​ చేయలేని పరిస్థితి వస్తే, బిడ్డ పుట్టిన తర్వాత అవసరమైతే తామే అమ్మిస్తామని చెప్పే డాక్టర్లు కూడా కొంత మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్​ఎంపీలకు రెగ్యులర్​ గా గిఫ్టులు ఇస్తున్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, తమ ఆస్పత్రికే పేషెంట్లను తీసుకువచ్చేలా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా కొవిడ్​ కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యశాఖ సరిగ్గా దృష్టిపెట్టకపోవడంతో స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్ లు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కడుపులో ఉన్నది అబ్బాయి అయితే వెంకటేశ్వర స్వామి ఫోటోను, అమ్మాయి అయితే అమ్మవారి ఫోటోను చూపిస్తూ హింట్ ఇచ్చే వారు కొందరైతే, బాబు   ఎదగాలంటే తల్లికి హెల్తీ ఫుడ్ పెట్టాలంటూ ఇంకొందరు చెప్పకుండానే చెప్పేస్తున్నారని సమాచారం. హెల్త్ డిపార్ట్ మెంట్ లోని కొందరు అధికారులకు చట్ట వ్యతిరేక చర్యలపై సమాచారమున్నా, మామూళ్ల కారణంగా లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. 

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు 

స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెగ్యులర్​ గా తనిఖీలు చేస్తున్నాం. ఇటీవల ఒక ఆస్పత్రిని, మెడికల్ షాపుని కూడా సీజ్​ చేశాం. ఇంకా ఎక్కడైనా, ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, అలాంటి వారి సమాచారం మాకు చెప్పితే తప్పకుండా  కఠిన చర్యలు తీసుకుంటాం.  
డాక్టర్​ మాలతి, డీఎంహెచ్​వో