ఎస్​ఎఫ్​సీ ఫండ్స్​ బంద్​..ఇబ్బందులు పడుతున్న సర్పంచ్ లు

ఎస్​ఎఫ్​సీ ఫండ్స్​ బంద్​..ఇబ్బందులు పడుతున్న సర్పంచ్ లు

వెలుగు, మహబూబ్​నగర్​/వనపర్తి/ ఆసిఫాబాద్: పంచాయతీలకు ఆరు నెలలుగా  ఎస్​ఎఫ్​సీ(స్టేట్​ఫైనాన్స్​ కార్పొరేషన్)​ ఫండ్స్​ నిలిపేసిన  రాష్ట్రసర్కారు, మూడు నెలలుగా అకౌంట్లను ఫ్రీజ్​ చేయడంతో గ్రామాల్లో సర్పంచులు మరోసారి ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఎస్​ఎఫ్​సీ ఫండ్స్​ ఆగిపోవడంతో కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోనే మల్టిపర్పస్​ కార్మికులకు జీతాలు,  ట్రాక్టర్ల నెలనెలా ఈఎంఐలు,  డీజిల్​, కరెంట్​ బిల్లులు కడుతూ వచ్చారు. తీరా ఫిబ్రవరి నుంచి పంచాయతీ అకౌంట్లపై ఫ్రీజింగ్ ​పెట్టడంతో15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జనరల్​ ఫండ్స్​ కూడా వాడుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో జీతాలు, ఈఎంఐల కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని సర్పంచులు అంటున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులు తమ జీతాల్లోంచి ట్రాక్టర్ల ఈఎంఐలు కట్​చేస్తున్నారని పంచాయతీ సెక్రెటరీలు వాపోతున్నారు.  

కేంద్రం ఇచ్చే ఫండ్స్​తో కార్మికులకు జీతాలు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పున రావాల్సిన ఎస్​ఎఫ్​సీ ఫండ్స్​గతేడాది నవంబర్​ నుంచి ఆగిపోయాయి.  దీంతో సర్పంచులు నవంబర్​ నుంచి 15వ ఫైనాన్స్​ కమిషన్​ నిధులను వాడుతూ వచ్చారు.  కేంద్రం నుంచి ప్రతి నెలా చిన్న పంచాయతీలకు రూ.80 వేలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల చొప్పున విడుదలవుతాయి. నిజానికి కేంద్రం రిలీజ్ చేసిన 2020–--21 గైడ్​లైన్స్​ ప్రకారం 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్​ను  స్కూళ్లు, అంగన్​వాడీ బిల్డింగులు, క్లాస్​రూములు, రోడ్లు, డ్రైనేజీలు, హెల్త్ సబ్ సెంటర్లు, జీపీ బిల్డింగుల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, ఇంటర్​నెట్​ ఫెసిలిటీస్​ కల్పించేందుకు వాడాలి. కానీ రాష్ర్ట ప్రభుత్వం ఎస్ఎఫ్​సీ ఫండ్స్​ ఇవ్వకపోవడంతో సర్పంచులు కేంద్రం ఇచ్చే నిధులను ట్రాక్టర్ ఈఎంఐలు కట్టేందుకు, డీజిల్ పోయించేందుకు, జీపీల కరెంటు బిల్లులు, మల్టీ పర్సస్ వర్కర్ల జీతాలు చెల్లించేందుకు వాడుతున్నారు. పల్లెప్రకృతి వనాలు, ఇంకుడు గుంతలు, డంప్ యార్డులు, హరితహారం నర్సరీల నిర్వహణకు వినియోగిస్తున్నారు. నిజానికి ఇది రూల్స్​కు విరుద్ధమైనా తప్పట్లేదని సర్పంచులు, సెక్రటరీలు చెబుతున్నారు.  

చెక్కులన్నీ వెనక్కి.. 

ఫిబ్రవరి నుంచి  పంచాయతీ అకౌంట్లపై ఫ్రీజింగ్​పెట్టడంతో 15వ ఫైనాన్స్​ కమిషన్​ ఫండ్స్​తో పాటు జనరల్​ ఫండ్స్​నూ వాడుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో​ మూడు నెలలుగా అకౌంట్లలో పైసలున్నా  కనీసం మల్టీ పర్పస్​ కార్మికులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని సర్పంచులు, సెక్రటరీలు వాపోతున్నారు. ఇది చాలదన్నట్లు సర్పంచులు అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు సంబంధించి నవంబర్ నుంచి పెండింగ్​లో ఉన్న చెక్కులను ట్రెజరీల్లో రిజెక్ట్​ చేశారు. మార్చి 31తో ఫైనాన్షియల్​ ఇయర్​ ముగిసినందున తిరిగి చెక్కులన్నింటినీ మరోసారి పంచాయతీలో తీర్మానం చేసి పంపాలంటూ తిప్పిపంపుతున్నారు. ఒక్క కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే 335 గ్రామ పంచాయతీలకు సంబంధించి రూ. 6 కోట్ల విలువైన 2 వేల చెక్కులు  వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. ఇన్ని నెలలు చెక్కులు దగ్గర పెట్టుకుని ఇప్పుడు వెనక్కి పంపడం ఏమిటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. అప్పులు తెచ్చి పనులు చేశామని, వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని  మండిపడుతున్నారు. సిబ్బందికి కూడా మిత్తికి తెచ్చి జీతాలు ఇయ్యాల్సి వస్తోందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లో నిధులు లేకే ఈ కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు.  

జీవితంలో సర్పంచ్​ కావద్దని నిర్ణయించుకున్నా .. 

మా గ్రామానికి ఇసుక రాయల్టీ ద్వారా మంచి ఆదాయం వస్తుంది. మా అకౌంట్​లో అన్ని రకాల ఫండ్స్​ కలిపి రూ.20 లక్షలు ఉన్నాయి. కానీ అకౌంట్​ ఫ్రీజ్​ చేయడంతో పైసా తీసి ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు సంబంధించి ట్రెజరీకి పంపిన చెక్కులను కూడా రిజెక్ట్  చేశారు.  మూడు నెలల నుంచి      సిబ్బంది కి జీతాలు ఇయ్యలేదు. వాళ్లు జీతాలు అడుగుతుంటే నా పరువు పోయినట్లు అనిపిస్తుంది. మళ్లీ జీవితంలో సర్పంచ్​ కావద్దని నిర్ణయించుకున్నా. 

-రామచంద్ర నాయక్, సర్పంచ్, కర్నె గ్రామం, వనపర్తి జిల్లా.

బిల్లులు ఆపిన్రు

అప్పులు తెచ్చి పనులు చేయించినా.  స్టేట్​ఫైనాన్స్ ​ఫండ్స్ ​లోంచి స్కూల్ బిల్డింగ్ కు పెయింటింగ్ వేయించిన.  ఇందుకోసం గత డిసెంబర్ లో గ్రామ పంచాయతీ తీర్మానం చేసినం. ఈ పనికి లక్షా 30వేలు కాగా,  ఏఈ, డీఈలతో ఎస్టిమేషన్, ఎమ్​బీ పూర్తి చేసి ఆన్​లైన్​లో చెక్కు జనరేట్ చేసి మార్చిలో ఎస్టీఓలో జమ చేశాం. ఏప్రిల్​ 27న ఆన్​లైన్ లో   చూడగా చెక్ రిజెక్ట్ అయింది.  ఇంటి, నల్ల బిల్లులు వసూలు చేసి ఎస్టీఓ లో జమచేసిన జనరల్​ ఫండ్స్​ పైసలు కూడా తీసుకోకుండా చేస్తున్నరు.  ఎక్కడైనా ఇంత అన్యాయం ఉంటదా?
–  బొట్ల భాస్కర్, సర్పంచ్​, నాగారం, జనగామ జిల్లా

 కూలీలకు జీతాలియ్యలేకపోతన్నం.. 

పంచాయతీ అకౌంట్లపై ఫ్రీజింగ్ ​పెట్టిన్రు. చేసిన పనులకు బిల్లులు ఇస్తలేరు.  మా మండలంలో 29 పంచాయతీల్లో కార్మికులకు జీతాలు ఇయ్యనీకి తక్లీబ్​ అయితంది. అప్పులు చేసి జీతాలు ఇయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. పనులకు సంబంధించిన చెక్కులు జనరేట్ చేసి ట్రెజరీలో సబ్మిట్​ చేస్తే రిజక్స్​ చేసి వెనక్కి పంపిన్రు.    

- కోట్నాక గణపతి, సర్పంచ్ కౌటగాం, తిర్యాణి,  సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్