ముషీరాబాద్, వెలుగు: సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన సగరులను బీసీ–డి కేటగిరీ నుంచి బీసీ–ఎ కేటగిరీలోకి మార్చాలని అఖిల భారత సగర మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభ ఆధ్వర్యంలో దసరా, దీపావళి సమ్మేళనం నిర్వహించారు.
మహాసభ జాతీయ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పర శేఖర్ సగర, గౌరవ అధ్యక్షుడు శ్రీరాములు మాట్లాడారు. రాజకీయ పార్టీలు సగరులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయే తప్ప ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
సగరులను బీసీ–ఎ కేటగిరీలో చేర్చేందుకు మాజీ సీఎం ఎన్టీఆర్ జీవో నంబర్ 166ను తీసుకొచ్చారని, దాని ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం జరిగే పోరాటంలో సగరులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాయకులు అనిల్ కుమార్, కమటం వేణుగోపాల్, శ్రీధర్, సత్యం, కుమారస్వామి, శ్రవణ్, ప్రకాశ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
