
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఈ అంశంపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో కేసీఆర్ కంటే తనే సీనియర్ ను అని, తనతో బీఆర్ఎస్ నేతలు ఎవరు చర్చకు వస్తారో రావాలన్నారు. మైనార్టీ సంక్షేమం మీద అయినా సరే చర్చకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఊసరవెళ్లిలా రంగులు మార్చుతున్నారని షబ్బీర్అలీ మండిపడ్డారు.
బీసీలకు గొప్పవరం: చనగాని దయాకర్
రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్పవరం 42 శాతం రిజర్వేషన్లని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం.. కుల గణన చేసి రిజర్వేషన్ల అమలు కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు అందరూ ఏకమై రిజర్వేషన్లను పొందేందుకు పార్టీలకతీతంగా కాంగ్రెస్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రిజర్వేషన్ల అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు తీరని ద్రోహం చేశాయని, ఇప్పుడు ఆ పార్టీలు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం హాస్యా స్పదమని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ను ఎవరు వేలెత్తి చూపినా తెలంగాణ సమాజం నమ్మదని దయాకర్ పేర్కొన్నారు.