లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ: షబ్బీర్ అలీ

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్,  బీజేపీ మధ్యే పోటీ: షబ్బీర్ అలీ

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్,  బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. శనివారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్, దేశంలో మోడీ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అయిపొయిందన్నారు. కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తామన్న కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడండని.. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు షబ్బీర్ అలీ.

మోడీ అబద్దాలలో నంబర్ వన్ అని... పరిశ్రమలు, ప్రాజెక్టులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని ఆయన చెప్పారు. 90 రోజుల్లో 31వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మెగా డీఎస్సీ కూడా వేశామన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు అన్నారు.. ఎక్కడ ఉందో ఎంపీ అర్వింద్ కు కూడా తెలియదని ఆయన విమర్శించారు. జీవన్ రెడ్డి ఎంపీ అయితే.. ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరుస్తారని.. మాయ మాటలు చెప్పే అర్వింద్ కు ఓటేయద్దన్నారు.

కేసిఅర్ కు పంటల పరిశీలన ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?.. 10ఏళ్లు అధికారంలో ఉండి ఎప్పుడైనా పంట  పరిశీలనకు వెళ్ళారా..?, రైతులను ఓదార్చారా..? అని షబ్బీర్ అలీ నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 6 సార్లు ప్రకృతి విపత్తులు సంభవించాయని.. అప్పుడు కేసీఆర్ కు రైతులు కనిపించలేదా? అని ప్రశ్నించారు. పంట నష్ట పోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుందని షబ్బీర్ అలీ తెలిపారు.