
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షార్జాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న షారుక్, ఆయన బృందాన్ని టీ-3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షారుక్ లగేజీని తనిఖీ చేయగా..అందులో ఆరు ఖరీదైన లగ్జరీ వాచీలు కనిపించాయి. వీటి విలువ సుమారుగా రూ. 18 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారుల అంచనా.
కస్టమ్స్ డ్యూటీ కింద రూ. 6.83 లక్షలు చెల్లించిన తర్వాతే షారుక్ ను అధికారులు విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నగదు మొత్తాన్ని షారుక్ క్రెడిట్ కార్డు నుంచే చెల్లించారు. షారుక్ బాడీ గార్డుతో పాటుగా మరికొంత మంది సిబ్బందిని మాత్రం ఈ రోజు ఉదయం వరకు విచారించి విడిచిపెట్టారు. షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు షారుఖ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డుతో సత్కరించారు.
ఇక షారుక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పఠాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకుడు. ఇందులో షారుఖ్ సరసన దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళ్, తెలుగు బాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.