ఆసియాకప్లో పాక్కు ఎదురుదెబ్బ

ఆసియాకప్లో పాక్కు ఎదురుదెబ్బ

చిరకాల ప్రత్యర్థులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆసియాకప్ 2022లో గెలుపే లక్ష్యంగా భారత్,పాక్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 28న దుబాయ్ వేదికగా రెండు జట్లు ఢీకొట్టుకోబోతున్నాయి. అయితే భారత్ పాక్ జట్లు తమ స్టార్ బౌలర్లు లేకుండానే ఈ మ్యాచులో ఆడనున్నాయి. 

బుమ్రా మిస్..
ఆసియాకప్లో భారత్కు మంచి రికార్డు ఉంది. మొత్తం 14 సార్లు ఆసియాకప్ జరిగితే అందులో 7 సార్లు భారతే విజేతగా నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఆటతీరు, ఆటగాళ్ల ఫాం ప్రకారం..ఆసియాకప్ 2022లో  భారతే ఫేవరెట్ అని మాజీ క్రికెటర్ల అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా ఆసియాకప్ నుంచి తప్పుకున్నాడు. ఆసియాకప్లో బుమ్రా లేకపోవడం భారత్కు పెద్ద లోటు. బుమ్రాతో పాటు..హర్షల్ పటేల్ కూడా గాయంతో వైదొలగడంతో టీమిండియాకు భారీ నష్టమే అని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. 

పాక్ పరిస్థితి ఇంతే..
ఆసియాకప్లో భారత్ను ఓడించాలని కసితో బరిలోకి దిగుతున్న పాక్కు షాక్ తగిలింది.  గాయంతో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న షాహీన్ అఫ్రిది..ఈ సిరీస్‌లో గాయపడ్డాడు. దీంతో ఆసియా కప్తో పాటు..ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి కూడా అతను దూరమయ్యాడు. 

టీమిండియా ఫ్యాన్స్ నిరాశ..
టీ20 వరల్డ్ కప్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటామని రోహిత్ శర్మ ..ఆసియా కప్ 2022 టోర్నీ ప్రోమో విడుదలలో కామెంట్ చేశాడు. షాహిన్ అఫ్రిది బౌలింగ్ ఛాలెంజ్‌పై స్పందిస్తూ.. పాత బాకీ ఇంకా మిగిలి ఉందన్నాడు.  రోహిత్ వ్యాఖ్యలతో టీమిండియా ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఆసియా కప్లో షాహిన్ అఫ్రిది బౌలింగ్లో రోహిత్ శర్మ దంచికొడుతుంటే చూడాలని ఆశపడ్డారు. కానీ గాయం కారణంగా షాహిన్ అఫ్రిది దూరం కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. 

టీ20 వరల్డ్ కప్లో సంచలన ప్రదర్శన
2021 టీ20 వరల్డ్ కప్లో  షాహీన్ అఫ్రిది సంచలన ప్రదర్శన చేశాడు. ఫస్ట్ బాల్కే రోహిత్ శర్మను ఔట్ చేసిన అతను..ఆ తర్వాత ఓవర్‌లో  కేఎల్ రాహుల్‌ను  క్లీన్ బౌల్డ్ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లోనే పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లను కోల్పోయి..151 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టార్గెట్ పాక్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా చేరుకుని..మొట్టమొదటి సారిగా వరల్డ్ కప్ చరిత్రలో భారత్పై విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 

టీ20 వరల్డ్ కప్ కోసం ఫ్యాన్స్ ప్రార్థన..
ఆసియాకప్లో భారత్ పాక్ జట్ల స్టార్ బౌలర్లు బుమ్రా, షాహీన్ అఫ్రిది లేకపోవడంతో మ్యాచ్ చప్పగా సాగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ లేకున్నా..టీ20 వరల్డ్ కప్ వరకు కోలుకోవాలని రెండు జట్ల అభిమానులు ప్రార్థిస్తున్నారు.