
మాలిక్ బిన్ దీనార్.. తమీమ్ అన్సారి.. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ.. నిజాముద్దీన్ ఔలియా.. ఈ దర్గాలన్నీ ఒకే చోట దర్శించుకోవచ్చు. అదేంటి ఇవన్నీ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాయి కదా! అనుకుంటున్నారా? అవును ఇవి ఒక్కోటి ఒక్కో రాష్ట్రంలో ఉన్నాయి. కానీ, అన్నీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లాలో దేశంలోని ప్రముఖ దర్గాలన్నింటీనీ కట్టించాడు జానీమియా. ఇక్కడ వీటితో కలిపి మొత్తం నలభై ఐదు దర్గాలున్నాయి. ఇంతకీ జానీమియా ఎవరంటే..
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపురం పరిధిలో పడమటి తండాలో ఒకేచోట దేశంలో ప్రసిద్ధి గాంచిన అనేక దర్గాలు ఉన్నాయి. ఇవి మతసామరస్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కొలుస్తారు ఈ దర్గాలను. అంతేకాదు వీటిని కట్టించింది కూడా ఒక హిందువే. ఆయన పేరు షేక్ జానీమియా.
జానీమియా అసలు పేరు రావుల లచ్చయ్య యాదవ్. కానీ, దేవుడి మీద భక్తితో తన పేరును‘షేక్ జానీమియా’గా మార్చుకున్నాడు. పెద్దగా చదువుకోలేదు. ఆయనకు చిన్నప్పటి నుంచే దైవభక్తి ఎక్కువ. అందుకే జీవితాంతం దేవుడి సేవ చేయాలని నిర్ణయించుకుని చిన్నప్పటినుంచి దర్గాల్లోనే ఉంటున్నాడు జానీమియా. ‘‘నాకు పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు దేవుడు కలలో కనిపించి..‘నువ్వు నా సన్నిధిలోనే ఉంటూ నాకు సేవ చేయాలి’ అని ఆజ్ఞాపించాడు.
దాంతో నల్గొండ జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో ఉన్న దర్గాకు వెళ్లాను. అక్కడే సుమారు 30 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత దేవుడు మళ్లీ కలలో వచ్చి దర్గాలు సందర్శించుకోమని ఆజ్ఞాపించాడు. ఐదు సంవత్సరాల పాటు తిరిగి దేశంలోని అన్ని ప్రముఖ దర్గాలను దర్శించుకున్నా. తిరిగి వచ్చిన తర్వాత దేవుడు మళ్లీ కలలో కనిపించి.. ‘నీ పొలంలో దర్గాలను కట్టించు’ అని చెప్పాడు. అందుకోసం కొన్ని ప్రదేశాలను కూడా సూచించాడు. దాంతో నా దగ్గర ఉన్న డబ్బుతో నా పొలంలోనే దేశంలో ఉన్న సుమారు 45 దర్గాలను కట్టించాను. దర్గాలు కట్టినప్పటి నుంచి చుట్టు పక్కల గ్రామాల వాళ్లు చాలామంది వచ్చి ఇక్కడ కందురులు చేస్తున్నారు. లంబాడావాళ్లు ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాలవాళ్లు దర్గాను ఇంటి దేవుడిగా కొలుస్తుంటారు’ అని చెప్పాడు జానీమియా.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి సంవత్సరం జాన్ పహాడ్ దర్గా ఉర్సు జరిగిన వారం తర్వాత ఇక్కడ ఉర్సు ఉత్సవం జరుగుతుంది.
దర్గాలంటే పవిత్రతకు నిదర్శనం
‘నాకు ఐదెకరాల పొలం ఉంది. అందులో వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బుతో దేవుడి సేవ చేస్తున్నా. దేవుడు ఎలా సూచిస్తే అలా ముందుకెళ్తా. 2017లో జాన్ పహడ్ సైదులు పేరుతో ఆరు లక్షల రూపాయలతో మొదటి దర్గా నిర్మించాను. అప్పటి నుంచి అక్కడే ఒక చిన్న పాక వేసుకుని ఉంటున్నా. దేవుడు నా కలలో కనిపించినప్పుడు సూచించిన ప్రదేశాల్లో మట్టితో గుర్తులు పెట్టాను. ఆ ప్రదేశాల్లో ప్రతి సంవత్సరం నాలుగైదు దర్గాలు కట్టిస్తున్నా. ఇప్పటికి 45 దర్గాలు పూర్తయ్యాయి. పెళ్లి చేసుకుని ఒక నెల మాత్రమే నా భార్యతో కలిసి ఉన్నా. తర్వాత దేవుడి సన్నిధికే పరిమితమయ్యాను.
దర్గాలు అంటే..
ఔలియాల(సూఫీ గురువుల) సమాధులనే దర్గాలుగా పిలుస్తుంటారు. దర్గా చరిత్ర తెలిపేకచ్చి తమైన ఆధారాలు లేకపోయినా అరబ్బీ భాషలో రచించిన కొన్ని గ్రంథాల ద్వారా రంగా రెడ్డిజిల్లా లోని ‘జహంగీర్ పీర్ దర్గా’ గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. సుమారు 700సంవత్సరాల క్రితం బాగ్దాద్ నుంచి గౌస్ మొహినుద్దీన్, బురానుద్దీన్ అనే ఇద్దరు మత గురువులుదేశ సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చారు.
కొంతకాలం తర్వాత వాళ్లు మరణించారు. వాళ్ల సమాధులనే ‘జహంగీర్ పీర్ దర్గా’ అని భక్తులుచెప్తుంటారు. 400 సంవత్సరాల క్రితం గోల్కొండ పాలిం చే రాజులు ఈ దర్గాకు పూజలు కూడాచేశారు. అప్పట్లో ఈ దర్గాకు నిర్వాహకులు లేకపోవడంతో తమ సిపాయిల్లో ఒకరైన సయ్యద్ఇబ్రాహిం అలీని దర్గా సంరక్షకుడిగా నియమించారు.