Shakib Al Hasan: 7000 పరుగులు, 500 వికెట్లు.. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా సరికొత్త రికార్డ్

Shakib Al Hasan: 7000 పరుగులు, 500 వికెట్లు.. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా సరికొత్త రికార్డ్

టీ20 క్రికెట్ లో ఒక బ్యాటర్ 7000 పరుగులు అంటే గ్రేట్ బ్యాటర్ గా పరిగణిస్తారు. 500 వికెట్లు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా చెప్పుకొస్తాం. మరి ఒకే ప్లేయర్ ఒకే ఫార్మాట్ లో 7000 పరుగులతో పాటు 500 వికెట్లు తీస్తే అతన్ని ఏమనాలి. ఖచ్చితంగా లెజెండ్స్ కేటగిరికి అర్హుడవుతాడు. ఇంతకీ అతడెవరో కాదు బంగ్లాదేశ్ క్రికెట్ లెజెండ్ షకీబ్ అల్ హసన్. టీ20 క్రికెట్‌లో రెండు దశాబ్దాల పాటు  ఆడుతూ వస్తున్న ఈ బంగ్లా ఆల్ రౌండర్.. టీ20 ఫార్మాట్ లో 7000 పరుగులతో పాటు 500 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 

38 ఏళ్ల ఈ బంగ్లా ఆల్ రౌండర్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఘనతను అందుకున్నాడు. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ తరపున ఆడుతున్న షకీబ్..సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ పడగొట్టి 500 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా రెండు ఓవర్లలోనే 11 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి తన వికెట్ల సంఖ్యను 502కు పెంచుకున్నాడు. టీ20 చరిత్రలో 500 వికెట్లు తీసిన ఐదవ బౌలర్ గా ఈ బంగ్లా ఆల్ రౌండర్ నిలిచాడు. 660 వికెట్లతో ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్   రషీద్ ఖాన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 

వెస్టిండీస్ దిగ్గజాలు డ్వేన్ బ్రావో (631), సునీల్ నరైన్ (590) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (554) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. 500 వికెట్ల క్లబ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ చూసుకుంటే షకీబ్ 7,574 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, డ్వేన్ బ్రావో 6,970 పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచాడు. 7000 పరుగుల క్లబ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లను గమనిస్తే షకీబ్ 502 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఆండ్రీ రస్సెల్ (487 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.