వెండి తెరపై శక్తిమాన్

వెండి తెరపై శక్తిమాన్

90 దశకంలో బుల్లితెరపై  అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ శక్తిమాన్. ముఖేష్ ఖన్నా లీడ్ రోల్లో కనిపించిన ఈ సీరియల్ను చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడేవారు. పలు భాషల్లో డబ్ అయి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న శక్తిమాన్ జనాన్ని మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. అయితే ఈసారి బుల్లితెరపై కాకుండా వెండితెరపై కనిపించనుంది. ఈ సీరియల్ను సినిమాగా రూపొందించే హక్కుల్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. మూడు భాగాలుగా శక్తిమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్గా వెండితెరపై కనిపించనున్నారని సోనీ పిక్చర్స్ ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు ఈ ట్రయాలజీకి దర్శకత్వం వహిస్తారని చెప్పింది. దీనికి సంబంధించి యూట్యూబ్లో ఓ షార్ట్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఫిల్మ్ జర్నలిస్టులుగా పనిచేసిన ప్రశాంత్ సింగ్, మాధుర్య వినయ్తో పాటు శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా ఈ ప్రాజెక్టుకు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 

డీడీ నేషనల్ ఛానెల్లో తొలుత హిందీలో టెలికాస్ట్ అయిన శక్తిమాన్ సీరియల్ను ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి టెలికాస్ట్ చేశారు. 1997 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఈ ధారావాహిక 2005 మార్చి 27 వరకు టెలికాస్ట్ అయింది. ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ అయిన శక్తిమాన్ అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రకరకాల ఫీట్స్ చేస్తూ ప్రజలను కాపాడిన శక్తిమాన్ క్యారెక్టర్కు.. కోట్లాది మంది అభిమానులుగా మారారు. శక్తిమాన్ ఫొటోను వాడుకుని చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేసుకున్నాయంటే ఆ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. కేవలం టైటిల్ రివీల్ చేసిన సోనీ పిక్చర్స్ మరే డీటెయిల్స్ ఇవ్వలేదు. దీంతో ఈ శక్తిమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. సోనీ పిక్చర్స్ ప్రకటనతో శక్తిమాన్ అభిమానులంతా సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.