రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన శరద్ పవార్

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన శరద్ పవార్

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తేలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తేల్చి చెప్పారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విపక్షాల సమావేశంలో  పాల్గొన్న  ఆయన ఈ అంశంపై స్పందించారు. భేటీలో పవార్ అభ్యర్థిత్వాన్ని మమత ప్రతిపాదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఇంకా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని స్పష్టంచేశారు. రాష్ట్రపతి రేసుపై శరద్ పవార్ క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. 

ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చించేందుకు మమత బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి 16 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. శరద్ పవార్ పోటీకి నిరాకరించడంతో మమతా బెనర్జీ మరో రెండు పేర్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల కృష్ణ గాంధీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫారూఖ్ అబ్దుల్లాల్లో ఒకరిని బరిలో నిలపాలని సూచించినట్లు సమాచారం. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో విపక్షాల తరఫు అభ్యర్థి ఎంపికపై దీదీ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సమావేశం ఏర్పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నేతలకు లేఖ రాశారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, శివసేన, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, డీఎంకే, ఆర్ఎల్డీ సహా పలు పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు.