పెరగనంటున్న ప్రభుత్వ బ్యాంకుల షేర్లు

పెరగనంటున్న ప్రభుత్వ బ్యాంకుల షేర్లు

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఇండియన్‌‌ ఈక్విటీ మార్కెట్లు వరుస సెషన్లలో దూసుకుపోతున్నా  ప్రభుత్వ బ్యాంకుల షేర్లు మాత్రం పెరగడం లేదు. మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకుల్లో ఐదు బ్యాంకుల షేర్లు  తమ ఫేస్‌‌ వాల్యు కంటే తక్కువలో ట్రేడవుతున్నాయి. ఇండియన్ ఓవర్‌‌‌‌సీస్ బ్యాంక్‌‌ షేరు ఫేస్ వాల్యూ రూ. 10 లు కాగా, శుక్రవారం సెషన్‌‌లో ఈ షేరు బీఎస్‌‌ఈలో  రూ. 9.27 వద్ద క్లోజయ్యింది.  మరోవైపు ఇదే సెషన్‌‌లో  సెన్సెక్స్‌‌ 326 పాయింట్లు పెరిగి 40,500 పాయింట్లకు పైన ముగిసింది. షేరు ఫేస్‌‌ వాల్యూ రూ. 10 వద్ద 2000 వ సంవత్సరంలో ఈ బ్యాంక్‌‌  మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఇండియన్‌‌ ఓవర్‌‌‌‌సీస్‌‌ బ్యాంక్‌‌తో పాటు, బ్యాంక్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్‌‌, పంజాబ్‌‌ అండ్‌‌ సింధ్ బ్యాంక్‌‌, సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కూడా తమ ఫేస్‌‌ వాల్యూ రూ. 10 కి దగ్గర్లోనే ట్రేడవుతున్నాయి. శుక్రవారం సెషన్‌‌లో పంజాబ్‌‌ అండ్ సింధ్ బ్యాంక్ షేరు రూ.  10.81 వద్ద క్లోజవ్వగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేరు రూ. 11.29 వద్ద ముగిసింది. సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా షేర్లు 12.45 వద్ద, యూకో బ్యాంక్ షేరు రూ. 12.14 వద్ద క్లోజయ్యాయి.

పబ్లిక్ షేర్‌‌‌‌ హోల్డింగ్‌‌ తక్కువే!

 

‘కరోనా సంక్షోభంతో భారీగా పడ్డ మార్కెట్లు తిరిగి గరిష్టాలకు చేరుకుంటున్నాయి. అయినప్పటకీ ప్రభుత్వ బ్యాంక్‌‌ షేర్లు మాత్రం ఇంకా తమ ఏడాది కనిష్టాల వద్దే ట్రేడవుతున్నాయి’ అని రెలిగేర్‌‌‌‌ బ్రోకింగ్‌‌ చీఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌‌‌ గుర్‌‌‌‌ప్రీత్ సిదానా అన్నారు. బ్యాంకుల అసెట్‌‌ క్వాలిటీ, బిజినెస్‌‌లు తగ్గడం, అప్పులు తక్కువగా ఇస్తుండడం వంటివి షేర్ల ధరలు పడడానికి కారణమవుతున్నాయని చెప్పారు. ఈ కారణాలన్నింటి వల్లనే ఎస్‌‌బీఐ లాంటి పెద్ద షేరు కూడా తక్కువ ధర వద్దే ట్రేడవుతోందని పేర్కొన్నారు. ఈ బ్యాంకుల్లో 90 శాతానికి పైగా వాటా ప్రభుత్వం వద్దే ఉంది.  ట్రేడ్‌‌  చేయడానికి పబ్లిక్‌‌ వద్ద లిమిటెడ్‌‌ నెంబర్లోనే షేర్లు అందుబాటులో ఉన్నాయి.  దీంతో ఈ బ్యాంక్‌‌ షేర్లలో ఫ్రీ ఫ్లోట్‌‌ తక్కువగా ఉందని ఎనలిస్టులు అంటున్నారు.  కాగా, ఇండియన్ ఓవర్‌‌‌‌సీస్‌‌ బ్యాంక్‌‌లో ప్రభుత్వ వాటా  95.84 శాతంగా ఉంది. యూకో బ్యాంక్‌‌లో 94.44 శాతంగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 93.33 శాతంగా, సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియాలో 92.39 శాతంగా ఉంది. పంజాబ్‌‌ అండ్ సింధ్ బ్యాంక్‌‌లో ప్రభుత్వ వాటా 83.06 శాతంగా ఉంది. చాలా వరకు ప్రభుత్వ బ్యాంకులు డబ్బులను సమీకరించేందుకు తమ షేర్‌‌‌‌హోల్డర్ల నుంచి అనుమతులు పొందాయి. దీంతో ఈ బ్యాంకుల్లో పబ్లిక్‌‌ షేర్‌‌‌‌ హోల్డింగ్‌‌ పెరిగే అవకాశం ఉంది.

డబ్బులు సమీకరించేందుకు రెడీగా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ. మూడు వేల కోట్లను సమీకరించేందుకు యూకో బ్యాంక్ తన షేర్‌‌‌‌హోల్డర్ల నుంచి ఆమోదం పొందింది. ఫాలో ఆన్‌‌ పబ్లిక్‌‌ ఆఫర్‌‌‌‌(ఎఫ్‌‌పీఓ), క్వాలిఫైడ్‌‌ ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ ప్లేస్‌‌మెంట్‌‌(క్యూఐపీ), ప్రిపెరెన్షియల్‌‌ ఇష్యూ వంటి వివిధ మార్గాల ద్వారా ఈ డబ్బులను సేకరించాలని బ్యాంక్ భావిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా క్యూఐపీ, ఎఫ్‌‌పీఓ లేదా రైట్స్‌‌ ఇష్యూ ద్వారా  రూ. రెండు వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని చూస్తోంది. ఇండియన్ ఓవర్‌‌‌‌సీస్‌‌ బ్యాంక్‌‌ రూ. 500 కోట్లను రైట్స్‌‌ ఇష్యూ ద్వారా సమీకరించాలనుకుంటోంది.  సెంట్రల్‌‌ బ్యాంక్ కూడా వేరు వేరు మార్గాల ద్వారా రూ. ఐదు వేల కోట్లను సేకరించాలనుకుంటోంది.