
సెప్టెంబర్ క్వార్టర్‌లో టాటా స్టీల్‌లోనే ఎక్కువ
బిజినెస్‌డెస్క్, వెలుగు: టాటా స్టీల్, జొమాటో, ఐటీసీ, మరో ఏడు కంపెనీల షేర్లలో ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో రూ. లక్ష కోట్లను ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు క్యూ2 లో 764 కంపెనీల షేర్లను కొనుగోలు చేయగా, ఈ లిస్టులో టాటా స్టీల్ టాప్‌లో ఉంది. రూ.24,898 కోట్ల విలువైన 244.52 కోట్ల టాటా స్టీల్ షేర్లను క్యూ2 లో ఎఫ్‌ఐఐలు కొన్నారని ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. క్యూ2 లో ఈ షేరు 14 శాతం లాభపడింది. ప్రభుత్వ రంగ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లలో రూ.22,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.
మొత్తం 87.89 కోట్ల షేర్లను సెప్టెంబర్ క్వార్టర్‌లో కొన్నారు. జొమాటో షేర్లను కొనేందుకు రూ. 8,057 కోట్లను ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్ చేశారు. ఏకంగా 139 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈసారి ఐటీసీ షేర్లను బాగానే కొనుగోలు చేశారు. రూ. 3,200 కోట్ల విలువైన 10.39 కోట్ల షేర్లను క్యూ2 లో కొనుగోలు చేశారు. రూ.15,680 కోట్ల విలువైన బజాజ్ ఫిన్సర్వ్ షేర్లను, రూ. 9,656 కోట్ల విలువైన మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లను, రూ.8,807 కోట్ల విలువైన ఎయిర్‌టెల్ షేర్లను క్యూ2 లో ఎఫ్‌ఐఐలు కొనుగోలు చేశారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో ఎఫ్‌ఐఐలు ఎక్కువగా కొనుగోలు చేసిన లిస్టులో ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.7,615 కోట్లు), హిందుస్తాన్ యూనిలీవర్ (రూ.4,495 కోట్లు), గెయిల్ ( రూ.4,018 కోట్లు) షేర్లు కూడా ఉన్నాయి.
ఏడాది గరిష్టానికి సెన్సెక్స్
సెన్సెక్స్ బుధవారం సెషన్‌లో క్లోజింగ్ పరంగా 61,981 వద్ద ఆల్‌టైమ్ హైని నమోదు చేసింది. రోజంతా డల్‌గా కదిలిన ఇండెక్స్‌లు బ్యాంకింగ్ షేర్లు పెరగడంతో కొద్దిపాటి లాభాలతో సెషన్‌ను ముగించాయి. సెన్సెక్స్ 108 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడేలో 62,053 వద్ద ఏడాది గరిష్టాన్ని రికార్డ్ చేసింది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 18,410 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, డా.రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 34 పైసలు తగ్గి 81.25 వద్ద సెటిలయ్యింది.