
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ చాట్‌బోట్ చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన బార్డ్ ఈ సెర్చింజిన్ కొంప ముంచింది. ప్రమోషనల్ వీడియోలో ఈ చాట్‌బోట్ తప్పులు చెప్పడంతో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్ ఒక్క రోజులోనే 100 బిలియన్ డాలర్లు (రూ.8.20 లక్షల కోట్లు) పడిపోయింది. కంపెనీ షేర్లు బుధవారం సెషన్‌లో 7 శాతం మేర క్రాష్ అయ్యాయి. గురువారం సెషన్‌లో మరో 4 శాతం లాస్‌తో ఓపెన్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ తన ఏఐ టెక్నాలజీని సెర్చింజన్ బింగ్‌తో ఇంటిగ్రేట్ చేసి యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. దీంతో గూగుల్ కూడా ఆ తర్వాత రోజే తొందర తొందరగా తన ఏఐ చాట్‌బోట్ బార్డ్‌ను లాంచ్ చేసింది. ఈ చాట్‌బోట్ ప్రమోషనల్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించింది. ఈ లైవ్ స్ట్రీమ్ ఈవెంట్‌లో బార్డ్ పనితనాన్ని తెలుసుకోవడానికి వివిధ ప్రశ్నలు అడిగారు . కొన్ని ప్రశ్నలకు ఈ చాట్‌బోట్ తప్పు ఆన్సర్ చెప్పిందని రాయిటర్స్ మొదట పేర్కొంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ మద్ధతు ఉన్న స్టార్టప్ కంపెనీ చాట్‌జీపీటీ సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్ ప్రశ్నలకు సమాధానాలను కరెక్ట్‌గా చెప్పడంతో పాటు అర్థమయ్యే విధానంలో వివరిస్తోంది. దీంతో గూగుల్ ఓపెన్ ఏఐలో వెనకబడుతోందా? అనే అనుమానాలు సిలికాన్ వ్యాలీలో చక్కర్లు కొడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ షేర్లు గురువారం 2 శాతం లాభంతో ఓపెన్ అయ్యాయి.
తప్పు ఆన్సర్ ఇదే..
‘9 ఏళ్ల పిల్లలకు చెప్పేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ (జేఎంఎస్‌టీ) కొత్తగా గుర్తించినవి ఏంటి?’ అనే ప్రశ్నకు బార్డ్ వివిధ సమాధానాలిచ్చింది. ఇందులో ‘భూమికి వెలుపల సోలార్ సిస్టమ్ ఫోటో తీసిన మొదటి శాటిలైట్ జేడబ్ల్యూఎస్‌టీ’ అనే ఆన్సర్ ఉంది. కానీ, నిజానికి యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలీస్కోప్ (వీఎల్‌టీ) 2004 లో మొదటిసారి ఈ ఫోటో తీసింది. దీన్ని నాసా నిర్ధారించింది కూడా. టెస్టింగ్ ప్రాసెస్ ఎంత ముఖ్యమో దీనిని బట్టి తెలుస్తోందని గూగుల్ స్పోక్స్‌పర్సన్ పేర్కొన్నారు. టెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వారం టెస్టింగ్ ప్రాసెస్‌ను మరోసారి మొదలు పెడతామని చెప్పారు. ఇంటర్నల్ టెస్టింగ్ రిజల్ట్స్‌తో పాటు బయట నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను కూడా తీసుకొని బార్డ్ రెస్పాన్స్ స్టాండర్డ్స్‌ను మెరుగుపరుస్తామని అన్నారు.
ఏఐలో రేస్..
ప్రస్తుతం టెక్నాలజీ సెక్టార్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పోటీ పెరుగుతోంది. టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఈ టెక్నాలజీ వైపు చూస్తున్నారు. ఏఐ మద్ధతుతో పనిచేసే సెర్చ్ ఇంజిన్‌లు సెర్చ్ రిజల్ట్స్‌ను సులభమైన లాంగ్వేజ్‌లో ప్రజెంట్ చేస్తాయి. దీంతో బ్రౌజింగ్ మరింత వేగంగా మారుతుంది. గూగుల్ రెవెన్యూకి కీలకమైన టార్గెట్ యాడ్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చాట్‌బోట్ ఏఐ సిస్టమ్స్ ద్వారా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో కూడా ఈ సర్వీస్‌లను కంపెనీలు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా, ఏఐ చాట్‌బోట్‌లు యూజర్ల ప్రశ్నలకు సమాధానాలిస్తాయి. బార్డ్‌ను ఇంకొన్ని వారాల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గూగుల్ ప్రకటించింది. ఇంతలో డెమోలో తప్పులు దొర్లాయి.
గూగుల్ సెర్చింజన్‌లో బార్డ్ ఎప్పుడు?
గూగుల్ లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్‌లో సెర్చింజన్‌లో బార్డ్‌ను ఎప్పుడు ఇంటిగ్రేట్ చేస్తారు? ఎలా చేస్తారు? అనే అంశాలపై క్లారిటీ రాలేదు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే చాట్‌జీపీటీతో ఇంటిగ్రేట్ అయిన బింగ్ సెర్చ్‌ను తీసుకొచ్చింది. ‘గత కొన్నేళ్ల నుంచి ఏఐ ఇన్నోవేషన్స్‌లో గూగుల్ ముందుంది. తమ సెర్చ్ ఇంజిన్లలో ఈ టెక్నాలజీని కలపడంలో ఈ కంపెనీ వెనకబడింది. మైక్రోసాఫ్ట్‌తో పోటీపడేందుకు తొందరపడి బార్డ్‌ను లాంచ్ చేసింది. డెమోలో తప్పు ఆన్సర్లు ఇవ్వడంతో కంపెనీ షేర్లు పడుతున్నాయి’ అని డీఏ డేవిడ్సన్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఎనలిస్ట్ గిల్ లూరియా పేర్కొన్నారు. బార్డ్ వివిధ ప్రశ్నలకు ఆన్సర్లు చెబుతున్న జిఫ్ వీడియోని ట్విట్టర్‌లో ఆల్ఫాబెట్ పోస్ట్ చేసింది. కానీ, ఈ వీడియోలో ఈ చాట్‌బోట్ తప్పు ఆన్సర్లు చెప్పడం కనిపిస్తోంది.