8 ఏండ్లలో గద్వాల జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు

 8 ఏండ్లలో గద్వాల జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు

 గద్వాల, వెలుగు: కేంద్ర మంత్రులు, బీజేపీ లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారని, ఈ అవినీతిపై ఎందుకు సీబీఐ ఎంక్వైరీ చేయించట్లేదని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే.. వెంటనే సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం యమునోని పల్లి నుంచి పాదయాత్ర కొనసాగింది. వైఎస్సార్​ చౌరస్తాలో జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైన్​ల పేరిట కేసీఆర్ సర్కారు కమీషన్లు దోచుకుంటోందని, కాంట్రాక్టులన్నీ మేఘా కృష్ణారెడ్డికి కట్టబెడుతోందని మండిపడ్డారు. వాటిలో కేసీఆర్ ఫ్యామిలీకి వాటాలున్నాయని ఆరోపించారు. 8 ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధే జరగలేదన్నారు. సీఎంకు దోచుకోవడం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని అప్పజెప్తే.. 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారన్నారు.

భూకబ్జాలో ఎమ్మెల్యే బిజీ

భూ కబ్జాలో గద్వాల ఎమ్మెల్యే బిజీగా ఉన్నారని, ఇసుక, మైనింగ్, మట్టి మాఫియా ముసుగులో దోచుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. ఎనిమిదేండ్లలో గద్వాల నియోజకవర్గంలో ఒక్క ఎకరానికైనా సాగునీరు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. మిషన్ భగీరథ 40 వేల కోట్లతో చేపట్టారని, దాని నీళ్ళు తాగి నలుగురు చనిపోతే పట్టించుకున్నోళ్లు లేరన్నారు. వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగిన డీకే అరుణ ఇప్పుడు ప్రజలను పట్టించుకోవట్లేదని షర్మిల అన్నారు. అతికుర్ రహిమాన్, పిట్టా రాంరెడ్డి ఏపూరి సోమన్న పాల్గొన్నారు.