ట్వీట్ హీట్ ! రాహుల్కు షర్మిల అభినందనలు

ట్వీట్ హీట్ ! రాహుల్కు షర్మిల అభినందనలు
  • ట్వీట్ హీట్ !
  • రాహుల్కు షర్మిల అభినందనలు
  • మీ కోసం దేశం ఎదురు చూస్తోందన్న వైఎస్సార్ టీపీ అధినేత్రి
  • మొన్న వైఎస్సార్ బర్త్ డే రోజున రాహుల్ ట్వీట్
  • మరోమారు తెరపైకి కాంగ్రెస్ లో విలీనం చర్చ

హైదరాబాద్ : రాహుల్ గాంధీని ఉద్దేశించి షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోంది. గుజరాత్ లోని సూరత్ కోర్టు తీర్పుతో పార్లమెంటులో అనర్హత వేటు పడింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో ఆయన నిన్న పార్లమెంటులోకి ఎంట్రీ ఇచ్చారు. దీనిపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీ కోసం దేశం ఎదురు చూస్తోందని వ్యాఖ్యానించారు. లోక్ సభలో మీ గళం వినిపిస్తారని దేశం ఎదురుచూస్తోంది..న్యాయం ధర్మం గెలిచాయనడానికి సుప్రీంకోర్టు తీర్పే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

‘మీరు తిరిగి పార్లమెంటులోకి రావడం ఎంతో అవసరం..అహర్నిషలూ ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాద పరిరక్షణ, దేశభద్రత, ఉన్నతి, ఐక్యతలపై మీ పోరాట పటిమ ఎంతో ఆదర్శం. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి భేషరతుగా నా నైతిక మద్దతు తెలియజేస్తున్నా’అని ప్రకటించారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్ కు షర్మిల స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో వీళ్లిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా సాగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు ఆసక్తిరేపుతున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం, ఆ పార్టీ అధికారంలోకి రావడంతో షర్మిల బెంగళూరు వెళ్లి అక్కడి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దీంతో ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయని చర్చ జరిగింది. ఆ తర్వాత డీకే బర్త్ డే రోజునా షర్మిల బెంగళూరు వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు జరపడం గమనార్హం. డీకే మధ్యవర్తిత్వంతో ఆమె నేరుగా ఏఐసీసీ నేతలతోనే సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం తమకెలాంటి సమాచారం లేదని, ఆ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని దాటవేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు దగ్గరపడుతుండటంతో విలీనం అంశం మారోమారు చర్చకు దారి తీసింది.