ముంపు భూముల్లో పరిహారం కాజేసేందుకు రాత్రికిరాత్రే షెడ్లు!

ముంపు భూముల్లో పరిహారం కాజేసేందుకు రాత్రికిరాత్రే షెడ్లు!
  • ముంపు భూముల్లో అక్రమ నిర్మాణాలకు తెరలేపిన దళారులు
  • కొంత డబ్బు ముట్టజెప్పి ముంపు రైతులతో అగ్రిమెంట్ల్ గ్రామ స్థాయి లీడర్లు, 
  • రెవెన్యూ ఆఫీసర్లు సహకరిస్తున్నారనే ఆరోపణలు

గద్వాల, వెలుగు: ముంపు భూముల్లో రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణాన్ని చేపడుతూ పెద్ద ఎత్తున పరిహారం కాజేసేందుకు స్కెచ్ వేశారు. అనుకున్నదే తడువుగా లోయర్  జూరాల పరిధిలోని ముంపు భూముల్లో పెద్ద ఎత్తున షెడ్లు వేస్తున్నారు. వీరికి గ్రామస్థాయి లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్లు సపోర్ట్  చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెద్ద ఎత్తున షెడ్లను నిర్మించి వాటికి పరిహారం తీసుకొనేందుకు ఆఫీసర్లతో రైతులు డీల్ కుదుర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇదీ అసలు సంగతి..

కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్ట్​ దిగువన నిర్మించిన లోయర్  జూరాల ప్రాజెక్టు పై భాగంలో వరద ఎక్కువగా వస్తున్న టైమ్​లో ప్రాజెక్ట్​ చుట్టుపక్కల భూములు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్ట్​ కట్టే టైమ్​లో 299 లెవెల్  వరకు ఉన్న భూములకు మాత్రం పరిహారం చెల్లించారు. ఆ లెవెల్ కన్నా నీళ్లు ఎక్కువగా వస్తుండడంతో ధరూర్  మండలంలోని పెద్ద చింతరేవుల, గద్వాల మండలం రేకులపల్లి గ్రామాలకు చెందిన కొంత మంది రైతుల పొలాలు ముంపునకు  గురవుతున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం రైతులు డిమాండ్  చేయడంతో జెన్​కో ఆఫీసర్లు 301 మీటర్ల లెవెల్  వరకు ముంపు ప్రాంతంగా గుర్తించారు.

 226, 227, 228, 235,238 సర్వే నెంబర్  నుంచి 270 సర్వే నెంబర్  వరకు ఉన్న 70 ఎకరాల భూమికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. నది తీర ప్రాంతంలో ఉండే ఆ పొలాల్లో వరి మాత్రమే పండుతుంది. అయితే పండ్ల తోటలు ఉన్నట్లు, షెడ్లు ఉన్నట్లు రికార్డులు సృష్టించి పరిహారం కాజేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో రైతు పొలంలో రెండు షెడ్లు ఉన్నట్లు లెక్కలేసి లక్షల్లో పరిహారం కొట్టేసేందుకు దళారులు, ఆఫీసర్లు స్కెచ్  వేశారని చెబుతున్నారు.

దళారులే నడిపిస్తున్రు..

దళారులు రైతులతో మాట్లాడి, వారి పొలాల్లో షెడ్లు వేస్తున్నారు. షెడ్లు వేసి రైతులకు కొంత డబ్బు ఇస్తున్న దళారులు, మిగిలిన పరిహారాన్ని తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దళారులకు రెవెన్యూ ఆఫీసర్లు సపోర్ట్ చేస్తుండడంతో షెడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మొదటి విడతలో భూములకు, రెండో విడతలో షెడ్లు, పండ్ల తోటలకు పరిహారం అందేలా ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. మొదటి విడత పరిహారంలో భాగంగా జెన్ కో నుంచి రూ.4.32 కోట్లు రిలీజ్  అయ్యాయి. ఈ డబ్బులు ఆర్డీవో అకౌంట్ లో జమ చేయగా, రైతులకు పంపిణీ చేసేందుకు 
ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంక్వైరీ చేస్తాం..

ముంపు భూముల్లో అక్రమంగా షెడ్లు వేయడానికి వీల్లేదు. ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై తహసీల్దార్లతో ఎంక్వైరీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించం. రిపోర్ట్  ఆధారంగా పరిహారం ఇస్తాం.

చంద్రకళ, ఆర్డీవో, గద్వాల