
సిద్దిపేట టౌన్, వెలుగు: గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమంగా తిన్న గొర్రెల డబ్బును కక్కించాలని గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సంఘం జిల్లా కార్యదర్శి ఆలేటి యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గొర్రెల పంపిణీ పథకంలో గొల్ల కురుమలకంటే ఎక్కువగా కొంత మంది పశుసంవర్ధక అధికారులు, దళారులు లాభపడ్డారన్నారు.
గతంలో ఏసీబీ విచారణలో రూ.700 కోట్లు అవినీతి జరిగినట్లు ప్రకటించగా ప్రస్తుతం ఈడీ వెయ్యి కోట్ల అవినీతి జరిగినట్లు ప్రకటించిందన్నారు. ఈ కేసుల విచారణ మరింత వేగవంతం చేసి అన్ని జిల్లా, మండల స్థాయిలో పూర్తి వివరాలు రాబట్టాలని కోరారు. అధికారులు, దళారులు తిన్న అవినీతి డబ్బును కక్కించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి సాకుతో గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కకు పెట్టే కుట్ర చేస్తోందని ఇది జరిగితే గొల్లకురుమలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో ఏగుర్ల ఎల్లయ్య, బైతి శేఖర్, దాసరి కనకయ్య, బర్మ కొమురయ్య,ఈరు లింగయ్య, కొమురెల్లయ్య, బెడిదే బాలమల్లు, బెడిదే కొమురయ్య, వాసూరి స్వామి, ఆలేటి ఆంజనేయులు పాల్గొన్నారు.