- ఏపీ నుంచి డీసీఎంలలో తెలంగాణకు..
- ఇక్కడ సర్టిఫై చేసి, ఫొటోలు దిగంగనే ఆంధ్రాకు
- ఇస్తున్నది కూడా పది, పదకొండు గొర్రెలే
- లేదంటే రూ.72 వేలు చేతిల పెడుతున్నరు
ఈ నెల 11న జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గొల్లపల్లెలో లబ్ధిదారులకు గొర్లు పంపిణీ చేసినప్పటి ఫొటో ఇది. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల నుంచి తెచ్చిన గొర్లను వెటర్నరీ డాక్టర్, ఆఫీసర్లు సర్టిఫై చేసి 12 మందికి యూనిట్‌కు 21 చొప్పున ఇచ్చినట్లు పేపర్లపై ప్రాసెస్ పూర్తి చేశారు. పంపిణీ కార్యక్రమం అయిపోగానే ఇచ్చిన గొర్లను దళారులు రిటర్న్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో లబ్ధిదారులు దళారుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కీమ్ కింద సర్కార్ ఇచ్చే డబ్బులకు 21 గొర్రెలు రావని పది పదకొండే వస్తాయని, అవి వద్దంటే రూ.72వేలు ఇస్తమని 21 గొర్లతో ఫొటోలు దిగి తమ గొర్లు తమకు ఇవ్వాలని దళారులు అంటున్నారు. ఆ మేరకు అగ్రిమెంటు చేసుకొన్న తర్వాతనే ఏపీ నుంచి గొర్లను తెస్తున్నామని, ఇదంతా ఆఫీసర్ల కనుసన్నల్లోనే జరుగుతోందని వాళ్లు చెప్తున్నారు.
గొర్రెల పంపిణీ స్కీమ్ మళ్లీ దారి తప్పుతోంది. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు సర్కారు ఇస్తున్న సబ్సిడీ గొర్రెలు ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి ఎట్లెట్ల వస్తున్నయో ఇక్కడ ఫొటోలు దిగంగనే మళ్ల అట్లట్ల వెళ్లిపోతున్నయ్. 45 రోజులుగా నడుస్తున్న గొర్రెల పంపిణీలో రీ సైక్లింగ్ దందా మళ్లీ మొదలైంది. దళారులు, ఆఫీసర్ల కనుసన్నల్లోనే ఇదంతాసాగుతోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులను ఇక్కడి ఆఫీసర్లు ఏపీకి పంపితే అక్కడి బ్రోకర్లు సర్కారు ఇచ్చే డబ్బులకు పది, పదకొండు గొర్లకు మించి రావంటున్నరు. ‘21 గొర్రెలు పంపిస్తాం. ఫొటోలు దిగాక మీరు పది ఉంచుకొని మిగిలినవి వెనక్కి పంపించండి. లేదంటే రూ.70 వేలు తీస్కొని మొత్తం గొర్రెలను రిటర్న్ కొట్టండి..’ అని చెబుతున్నరు. ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వాళ్లదీ అదే మాట కావడంతో గత్యంతరం లేక లబ్ధిదారులు పైసలు తీస్కుంటున్నరు.
ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామ 30 మంది లబ్ధిదారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. జనగామ జిల్లాలో 150 మంది లబ్ధిదారులను దళారులు ఇదే విధంగా దోచుకున్నారు. ఇలా రెండో విడత గొర్రెల పంపిణీ మొదలైనప్పటి నుంచి ఇదే తంతు నడుస్తోంది.
రెండో విడత మూడు లక్షల యూనిట్లు..
2017లో ప్రారంభమైన గొర్రెల పంపిణీ స్కీం కింద ఇప్పటి వరకు 3,66,797 మందికి 77 లక్షల 2 వేల 737 గొర్రెలు పంపిణీ చేసినట్లు సర్కారు చెబుతోంది. మొదటి విడత డీడీలు కట్టిన 28,335 మందికి మూడేండ్ల తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు. రెండో విడతలో రూ.3 వేల కోట్లతో మరో 3 లక్షల యూనిట్లను అందిస్తామని బడ్జెట్సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మొదటి విడత డీడీలు కట్టినోళ్లకు, రెండో విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రస్తుతం గొర్ల పంపిణీ ప్రారంభించారు. అయితే ఆలస్యంగానైనా గొర్లు వస్తున్నాయని సంబురపడ్డ లబ్ధిదారులకు ఆఫీసర్లు, బ్రోకర్లు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు. గొర్ల ధరలు పెరిగాయని, ఒక్కో యూనిట్‌కు సర్కారు ఇచ్చే డబ్బులు చాలడం లేదంటూ దగ్గరుండి రీసైక్లింగ్ దందాను ప్రోత్సహిస్తున్నారు.
రీ సైక్లింగ్ ఇట్ల
గొర్ల కోసం ఆఫీసర్లు ఇక్కడి లబ్ధిదారులను ఏపీలోని గుంటూరు, కర్నూలు జిల్లాలకు పంపిస్తున్నారు. గొర్రెలు చూపిస్తారంటూ అక్కడి బ్రోకర్లకు వీళ్లను అటాచ్ చేస్తున్నరు. వాళ్లు మూడు నాలుగు రోజులు తిప్పి చేతిలో డబ్బులు ఖర్చయినంక గొర్లను చూపిస్తున్నారు. ప్రస్తుతం సర్కారు యూనిట్ కాస్ట్ కింద రూ.1.25 లక్షలు చెల్లిస్తోంది. ఇందులో లబ్ధిదారుడి వాటా రూ.31,250 పోను ప్రభుత్వం రూ.93,750 సబ్సిడీగా ఇస్తోంది. దీంట్లో గొర్రెలకు ఇచ్చేది రూ .లక్షా పదకొండు వేలు మాత్రమే. మిగిలిన రూ. 24 వేలను ట్రాన్స్పోర్ట్, ఇన్సురెన్స్, మందులు, దాణా ఖర్చుల కింద చెల్లిస్తోంది. ఇప్పుడున్న రేట్లను బట్టి రూ.లక్షా 11 వేలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలు రావని, మహా అయితే 11 గొర్రెలు మాత్రమే వస్తాయని ఏపీలోని బ్రోకర్లు చెబుతున్నారు. ‘మీకు 21 గొర్రెలు ఇస్తం.. మీ ఊరు వెళ్లి ఫొటోలు దిగిన తర్వాత తిరిగి 10 గొర్రెలను అదే డీసీఎంలో వెనక్కి తీసుకెళ్తం’ అనేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. లేదంటే మొత్తం 21 గొర్రెలను తిరిగి వెనక్కి తీసుకెళ్తం.. గంప గుత్తగా రూ.70 వేల నుంచి రూ.75వేలు ఇస్తమని చెబుతున్నరు. లబ్ధిదారులు ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వాళ్లు కూడా అదే చెబుతుండడంతో గత్యంతరం లేక ఒప్పుకుంటున్నట్లు గొల్ల కురుమలు చెబుతున్నారు. ఆంధ్రాలో రాత్రి గొర్రెలతో బయల్దేరే డీసీఎంలు తెల్లారే సరికి ఇక్కడికి చేరుతున్నాయి. కాసేపు మేత మేయగానే ఉదయం 11 గంటలకు ఇక్కడి వెటర్నరీ ఆఫీసర్ల సర్టిఫై, ఫొటోలు దిగడం తదితర తంతు పూర్తి చేస్తున్నారు. అదే రోజు రాత్రి ఇక్కడి నుంచి బయల్దేరి తెల్లారేసరికి ఏపీకి చేరుతున్నట్లు వాపోతున్నారు.
గట్టిగా అడిగితే బక్క పల్చనివే..
కనీసం11 గొర్రెలైనా తెచ్చుకుందామని గట్టిగా అడిగితే బక్కపల్చని పిల్లలను ఇచ్చి పంపుతున్నారు. డీసీఎంలో ఇక్కడికి వచ్చే సరికి వాటిలో ఒకటో రెండో చనిపోతున్నాయని, తప్పని పరిస్థితుల్లో ఎంతో కొంత డబ్బు తీసుకునేందుకు ఒప్పుకుంటున్నామని గొల్లకుర్మలు వాపోతున్నారు. మొదటి విడత పంపిణీ టైంలో ఇక్కడి వెటర్నరీ ఆఫీసర్లు లబ్ధిదారుల వెంట ఏపీకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు లబ్ధిదారులనే సర్టిఫై చేసి పంపిస్తున్నారు. ఆంధ్రాలోని వెటర్నరీ ఆఫీసర్ కూడా 21 గొర్రెలు డీసీఎం ఎక్కించి రిపోర్ట్ రాస్తున్నారు. తెలంగాణకు వచ్చాక ఇక్కడి ఆఫీసర్లు 21 గొర్రెలు అందినట్లు ఫొటోలు తీసి రిపోర్టులు రాసుకుంటున్నారు. అయితే ఇదంతా అఫీషియల్ పేపర్ మీద జరుగుతుంది. కానీ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం గొర్రెలు అదే డీసీఎంలో తిరిగి ఆంధ్రాకు వెళ్తున్నాయి.
10 గొర్లే ఇస్తరట..
21 గొర్రెలు ఇయ్యమంటే ఇస్తలేరు. పైసలు సాలవంటున్నరు. 10 గొర్లు ఇస్తం.. లేదంటే 72 వేలు ఇస్తమని బ్రోకర్లు సతాయించిన్రు. గిదేం అంటే మాకు సర్కారు ఇచ్చేది 90 వేలు.. ఇందులో అందరికి వాటాలుంటయ్. ఇష్టముంటేనే తీసుకెళ్లండి అని అన్నరు. 10 రోజులు తిరిగి తిరిగి యాష్టపడ్డం. మా ఊరి నుంచి 106 మందిమి పోతే ఎనిమిది మంది పది గొర్ల చొప్పున తెచ్చుకున్నరు. మిగిలినోళ్లం అంత రూ.72 వేలు తెచ్చుకున్నం.
- గద్ద రాజయ్య, కృష్ణాజీ గూడెం, జనగామ జిల్లా
