వరదల్లో చిక్కి .. రోజంతా చెరువుకట్టపైనే ... కాపాడిన రెస్క్యూ టీం..

 వరదల్లో చిక్కి .. రోజంతా చెరువుకట్టపైనే ...  కాపాడిన రెస్క్యూ టీం..
  • రైతులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేర్చిన అధికారులు
  • మానేరులో చిక్కుకున్న ఏడుగురు రైతులు
  • ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌ ద్వారా రెస్క్యూ చేసిన ఆఫీసర్లు
  • ఇదే వాగులో చిక్కుకున్న మరో ఇద్దరిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్‌‌‌‌
  • నిర్మల్‌‌‌‌ జిల్లాలో 24 గంటలు శ్రమించి పశువుల కాపరిని ఒడ్డుకు చేర్చిన అధికారులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు :  సిరిసిల్ల, నిర్మల్‌‌‌‌ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారిని ఆఫీసర్లు సేఫ్‌‌‌‌గా తీసుకొచ్చారు. సిరిసిల్ల జిల్లా మానేరు అవతలి ఒడ్డున ఏడుగురు వ్యక్తులు చిక్కుకోగా.. హైదరాబాద్‌‌‌‌ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌ను రప్పించి వారిని రెస్క్యూ చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల క్యాంప్‌‌‌‌కు చెందిన జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేశ్, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, బిసే ప్రదీప్, బిసే ఛాయ పశువులను కట్టేసేందుకు బుధవారం మానేరు అవతలి ఒడ్డుకు వెళ్లారు. మానేరు దగ్గరున్న లోలెవల్‌‌‌‌ వంతెనపైనుంచి వరద భారీఎత్తున ప్రవహిస్తుండటంతో వారు అవతలి ఒడ్డునే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ వారిని కాపాడేందుకు 24 గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

దీంతో డ్రోన్‌‌‌‌ సాయంతో వారికి ఆహారపదార్థాలు పంపించారు. గురువారం వరద ప్రవాహం మరింత పెరగడంతో ఏడుగురిని రెస్క్యూ చేయడం సాధ్యం కాలేదు. దీంతో కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ ఝా, ఎస్పీ మహేశ్ బి.గీతే మానేరు దగ్గరే ఉండి పరిస్థితిని సమీక్షించి.. వివరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డితో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం హకీంపేట ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ నుంచి ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌కు చెందిన రెండు హెలికాప్టర్లు గంభీరావుపేట మండలానికి చేరుకొని నర్మాల వద్ద మానేరు అవతల చిక్కుకున్న ఏడుగురు రైతులను సేఫ్‌‌‌‌గా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

మరో ఇద్దరిని కాపాడిన ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌

గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన రైతు ప్రవీణ్‌‌‌‌ బుధవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఓ బండపై నిల్చున్నాడు. గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ ఝా, ఎస్పీ మహేశ్‌‌‌‌ బి.గీతే లింగన్నపేటకు చేరుకొని ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌తో మాట్లాడారు. 

వరద తగ్గుతుందేమోనని వేచిచూసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి 12 గంటలకు బోటు సాయంతో ప్రవీణ్‌‌‌‌ను కాపాడారు. అలాగే గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా గురువారం సాయంత్రం ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌ చేపట్టి దేవయ్యను సురక్షిత ప్రాంతానికి తరలించింది. 

కాగా, నర్మాల ఎగువ మానేరులో నాగయ్య అనే రైతు గల్లంతయ్యారు. బుధవారం పశువులను మేపడానికి వెళ్లిన నాగయ్య తిరిగి వస్తుండగా మానేరు డ్యాం వద్ద వరదను దాటుతుండగా కొట్టుకుపోయాడు. వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో గాలింపు సాధ్యం కాలేదు.

కలెక్టర్, ఎస్పీకి బండి సంజయ్, ఆది శ్రీనివాస్ అభినందన

మానేరులో చిక్కుకున్న రైతులను క్షేమంగా తీసుకొచ్చేలా కృషి చేసిన కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ ఝూ, ఎస్పీ మహేశ్‌‌‌‌ బి గీతేను కేంద్రమంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌ అభినందించారు.

నిర్మల్‌‌‌‌ జిల్లాలో రైతును..

నిర్మల్, వెలుగు: గోదావరి నది కుర్రులో చిక్కుకుపోయిన ఓ పశువుల కాపరిని 24 గంటల తర్వాత ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఒడ్డుకు చేర్చింది. నిర్మల్‌‌‌‌ జిల్లా లక్షణ్‌‌‌‌చాందా మండలం మునిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పశువులను మేపేందుకు గోదావరి నది కుర్రు వైపు వెళ్లారు. అంతలోనే భారీ వర్షం కురవడం, ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో ముగ్గురు ఆ కుర్రులోనే చిక్కుకున్నారు.

 విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. అయితే గుగులావత్‌‌‌‌ శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌ అనే పశువుల కాపరి మాత్రం అక్కడే చిక్కుకుపోయాడు. గంట గంటకు నదీ ప్రవాహం పెరుగుతుండడంతో శంకర్‌‌‌‌ను ఒడ్డుకు తీసుకురావడం సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌‌‌‌ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఘటనాస్థలానికి చేరుకొని శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌ను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. 

అప్పటికే రాత్రి కావడంతో రెస్క్యూను తాత్కాలికంగా ఆపేశారు. తిరిగి ఉదయం డ్రోన్‌‌‌‌ ద్వారా బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ పంపించారు. శంకర్‌‌‌‌తో ఎస్పీ మాట్లాడి ధైర్యం చెప్పారు. అప్పటికి వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో రెండు ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ రంగంలోకి దిగి శంకర్‌‌‌‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం లక్షణచాంద పీహెచ్‌‌‌‌సీకి తరలించి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీని, ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌ను స్థానికులు అభినందించారు.

24 గంటల పాటు చెరువు కట్టపైనే..

దుబ్బాక, వెలుగు : పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు వరదలో చిక్కుకొని 24 గంటల పాటు చెరువు కట్టపైనే గడిపారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామానికి చెందిన షేర్ల గోపాల్, షేర్ల రాజు, చింతల సుదర్శన్ బుధవారం మధ్యాహ్నం పోతారెడ్డిపేట చెరువు కట్ట దగ్గరున్న పొలానికి వెళ్లారు. ఈ టైంలో భారీ వర్షం, వరద రావడంతో అక్కడే చిక్కుకుపోయారు.

 విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చెరువు వద్దకు చేరుకునే సరికే చీకటి పడడంతో రక్షణ చర్యలులు చేపట్టలేకపోయారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్‌‌‌‌రెడ్డి, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్సై హరీశ్‌‌‌‌ డ్రోన్‌‌‌‌ సాయంతో రైతులకు ఆహార పదార్థాలు, మొబైల్‌‌‌‌ పంపించారు. గురువారం ఉదయం ఎస్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌తో పాటు రెవెన్యూ, పోలీసులు బృందాలు ప్రత్యేక బోట్‌‌‌‌లో వెళ్లి ముగ్గురిని సురక్షితంగా తీసుకొచ్చారు.