
మంజీరా నదీ ప్రవాహంలో చిక్కుకుపోయిన ఆరుగురు గొర్ల కాపరులు, రెండు వేల గొర్రెలను అధికారులు నాలుగు రోజుల తర్వాత ఇవతలి ఒడ్డుకు తీసుకువచ్చారు. నారాయణపేట జిల్లా మర్కల్గ్రామానికి చెందిన మల్లేశం, చిన్నప్ప, మల్లప్ప, నర్సింలు, అనిల్, హన్మంత్నాలుగు రోజుల క్రితం రెండువేల గొర్రెలను మేపేందుకు మెదక్జిల్లా కొల్చారం మండలం హనుమాన్ బండల్ సమీపంలోని మంజీరా నదీ పాయల మధ్యలో ఉన్న కుర్వగడ్డకు వెళ్లారు.
సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీరా నదీ పాయల్లో నీటి ప్రవాహం బాగా పెరిగింది. దీంతో కుర్వగడ్డ మీద ఉన్నవారు బయటకు రాలేకపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ ఆదేశాల మేరకు సింగూరు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. నదీ పాయల్లో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో బుధవారం కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్, వెటర్నరీ డిపార్ట్మెంట్ఆఫీసర్ల ఆధ్వర్యంలో గొర్రెల కాపరులు, గొర్రెలను కిష్టాపూర్ సమీపంలో నిర్మించిన బ్రిడ్జి మీద నుంచి బయటకు తీసుకువచ్చారు.