Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ముందు అదే అతి పెద్ద ఛాలెంజ్: 14 ఏళ్ళ క్రికెటర్‌కు ధావన్ సలహా

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ముందు అదే అతి పెద్ద ఛాలెంజ్: 14 ఏళ్ళ క్రికెటర్‌కు ధావన్ సలహా

బీహార్ కు చెందిన 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తో క్రికెట్ లో వేగంగా దూసుకొస్తున్నాడు. ఐపీఎల్ 2025 లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ళ వయసులోనే ఈ మెగా టోర్నీలో ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచి సంచలనంగా మారాడు. లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన వైభవ్ ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. సన్ రైజర్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి ఫ్యూచర్ స్టార్ అంటూ కితాబులందుకున్నాడు.

గుజరాత్ టైటాన్స్ పై  35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని ఐపీఎల్ లో సంచలనంగా మారాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లున్నాయి. వైభవ్ ఫామ్ ఐపీఎల్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన అండర్-19 టోర్నీలో ఒక భారీ సెంచరీతో సహా ఐడి మ్యాచ్ ల్లో 355 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా వైభవ్ దూకుడు ముందు బౌలర్లు కుదేలైపోతున్నారు. ఇలాగే వైభవ్ ఫామ్ కొనసాగితే మరో రెండేళ్లలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. 14 ఏళ్లకే ఇంత కీర్తి, గొప్ప పేరు సాధించిన ఈ 14 ఏళ్ళ కుర్రాడికి టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ జాగ్రత్తలు చెప్పాడు. 

ధావన్ మాట్లాడుతూ.. " వైభవ్ కు వస్తున్న కీర్తి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గొప్ప పేరు వస్తున్నప్పుడు వాటిని హ్యాండిల్ చేయడం అతి పెద్ద ఛాలెంజ్. అంచనాలను నిలబెట్టుకోవాలంటే సూర్యవంశీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అతని అదృష్టం ఏంటంటే.. వైభవ్ దిగ్గజాల మధ్యలో ఉన్నాడు. రాహుల్ భాయ్, విక్రమ్ పాజీ (రాజస్థాన్ రాయల్స్ కోచ్‌లు) వైభవ్ తోనే ఉండడం అతనికి ఒక వరం. వారు చాలా మంచి క్రికెటర్లు. వీరిద్దరూ నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడమే కాకుండా మంచి మనుషులను కూడా తయారు చేయాలని నమ్ముతారు. మంచి మనిషిగా ఉండడం చాలా ముఖ్యం". అని ధావన్ హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నాడు.