సీఎం ఉద్ధవ్ ఇంటికి భారీగా వచ్చిన శివసేన కార్యకర్తలు

సీఎం ఉద్ధవ్ ఇంటికి భారీగా వచ్చిన శివసేన కార్యకర్తలు

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అధికారిక నివాసానికి భారీగా శివసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. తమ మద్దతు సీఎంకేనంటూ ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ఆయన అధికారిక నివాసం వద్ద మహిళలతో పాటు ఇతర కార్యకర్తలు వరుసగా నిలబడి తమ మద్దతు తెలియచేస్తున్నారు. ఈక్రమంలో కొంతమంది కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి ఏక్ నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేయడంతో సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చారు సీఎం ఉద్ధవ్ థాక్రే. రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కమాట చెబితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో శివసేన కార్యకర్తల్లో కొంతమంది భావోద్వేగానికి గురై ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. శివసేన ఎప్పటికీ విడిపోదని, తాము ఉద్ధవ్ కు వెన్నుదెన్నుగా ఉంటామని స్పష్టం చేశారు. ఏక్ నాథ్ షిండే చేసిన పని సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

34 మంది శివసేన ఎమ్మెల్యేలు..

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అంతకంతకు మారిపోతున్నాయి. మహా వికాస్ అఘాడీ సర్కారు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. 34 మంది శివసేన ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేను తమ నేతగా ఎన్నుకున్నారు. ఏక్ నాథ్ షిండేను తమ నేతగా గుర్తించాలంటూ మహారాష్ట్ర గవర్నర్ కు తిరుగుబాటు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. శివసేన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా.. ఉద్ధవ్ థాక్రే ప్రత్యర్థులతో చేతులు కలిపారని లేఖలో ఆరోపించారు. మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్ధతు ఇస్తే తిరుగుబాటు వర్గానికి గుర్తింపు లభించనుంది. తనకు 46మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే తెలిపారు. ఇందులో ఆరేడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారన్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతోందన్నారు. తనతో బీజేపీ నేతలు ఎవరూ టచ్ లో లేరని చెప్పుకొచ్చారు షిండే. సొంతపార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.