శివాజీకి 15 ఏళ్లు

శివాజీకి 15 ఏళ్లు

దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం క్రేజ్ ఉన్న స్టార్ ఒకరు. ఫిల్మ్ మేకింగ్ కు డిక్షనరీ లాంటి డైరెక్టర్ మరొకరు. ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? శివాజీ సినిమాలా ఉంటది. ఔను.. గ్రేట్ యాక్టర్, విజన్ ఉన్న డైరెక్టర్ తీసిన సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శివాజీ. రజనీకాంత్ హీరోగా, శంకర్ డైరెక్షన్ లో తీసిన ఈ మూవీ రిలీజై నేటికి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమా గురించి కొన్ని విశేషాలు.. 

తిరుగులేని హిట్
శంకర్, రజనీ కలయికలో వచ్చిన మొట్టమొదటి సినిమా శివాజీ. అంతకు ముందు చాలాసార్లు కలిసి పని చేయాలనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు అవకాశం దొరికింది. అప్పటికే శంకర్‌‌ తిరుగులేని హిట్లు కొట్టి ఉన్నాడు. దాంతో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. రజనీ వంటి స్టార్‌‌తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడా అని అందరిలోనూ ఆసక్తి. వారి అంచనాలు నిజం చేస్తూ ‘శివాజీ’ సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేసింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలొచ్చి వంద కోట్లు ఈజీగా రాబట్టేస్తున్నాయి. కానీ పదిహేనేళ్ల క్రితమే నూట యాభై కోట్లకు పైగా సంపాదించి శివాజీ సంచలనం సృష్టించింది.

కథే బలం
స్టోరీ బలంగా ఉన్న ఏ సినిమాకైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. శివాజీ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ మూవీ స్టోరీ చాలా స్ట్రాంగ్‌. ఫారిన్‌లో పని చేసి బాగా సంపాదించిన శివాజీ ఇండియాకి వచ్చి, తన పేరుతో ఓ నాన్ ప్రాఫిటబుల్ ట్రస్టును ప్రారంభిస్తాడు. దాని ద్వారా పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలనుకుంటాడు. కానీ అప్పటికే ఎన్నో కాలేజీలు, హాస్పిటళ్లు ఉన్న ఆది శేషుకు అది నచ్చదు. తన పలుకుబడితో శివాజీకి అడ్డుపడుతూ ఉంటాడు. దానికి తోడు అవినీతి పరులైన అధికారులకు లంచాలు ఇవ్వాల్సి రావడం శివాజీని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అనుకున్నది సాధించడం కోసం ఎన్నో కష్టాలు పడతాడు. అప్పులపాలైపోతాడు. చివరికి తనని చంపాలని చూసిన ఆదిశేషు నుంచి ఎలా తప్పించుకున్నాడు. తాను అనుకున్నది సాధించాడా అన్నది మిగతా కథ. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు మొదట కథకి కనెక్టైపోయాడు. ఎందుకంటే వైద్యం, విద్య అనేవి అందరి అవసరాలు. వాటిని ఉచితంగా ఇవ్వాలనే హీరో ఆశయం చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకే అతడు ఇబ్బందులుపడుతుంటే తమ కోసమే కష్టపడిపోతున్నాడన్నంతగా ఆడియెన్స్ బాధపడిపోయారు. సినిమా చూసేవాళ్లని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం కంటే గొప్ప సక్సెస్ ఏ సినిమాకైనా ఏముంటుంది!

రజినీతో అట్లుంటది మరి!
డిఫరెంట్ కథ, మంచి క్యారెక్టర్ దొరికితే రజినీ విశ్వరూపం చూపిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. శివాజీ సినిమాతో ఆయనకు మరోసారి తన సత్తా చూపించే అవకాశం దొరికింది. టైటిల్‌ రోల్‌లో రజనీ చెలరేగిపోయారు. ఆయన స్టైల్‌ సినిమాకి అడిషనల్ అట్రాక్షన్ అయ్యింది. ‘నాన్నా పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’ అని ఆయన డైలాగ్ చెబుతుంటూ థియేటర్లు విజిల్స్ తో దద్దరిల్లిపోయాయి. పోలీస్ స్టేషన్‌లో విలన్  కట్టేసి కొడుతుంటే అంకెలు లెక్కపెడుతుంటారు రజినీ. ఏంట్రా లెక్కపెడుతున్నావ్ అంటే.. తిరిగిచ్చేయాలిగా అంటాడు. ఆ సీన్‌కి వచ్చిన రెస్పాన్స్‌ మామూలుది కాదు. అంతేకాదు.. హీరోయిన్ ప్రేమ కోసం రజనీ వేసే చిలిపి వేషాలు కూడా అందరికీ తెగ నచ్చేశాయి. ముఖ్యంగా తెల్లగా అయ్యేందుకు ఆయన తంటాలు పడటం నవ్వులు పూయించింది. ‘ఎందుకమ్మా నన్నింత నల్లగా కన్నావ్’ అని తల్లిని అడిగితే.. ‘తెల్లగా ఉంటే మాసిపోతావని నాన్నా’ అంటుందామె. ఒక స్టార్ హీరో అయ్యుండి ఇలా తన రూపంపై తానే సెటైర్ వేసుకోవడం బహుశా రజనీకే చెల్లింది. ఇక మూవీ చివరలో గుండుతో కనిపించి సర్‌‌ప్రైజ్ చేయడం అతి పెద్ద హైలైట్. ఏదేమైనా శివాజీ సినిమాకి రజినీ తన స్టైల్‌తో, మేనరిజంతో మరింత హైప్‌ తెచ్చారనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో ఇంకా చాలా పాత్రలు ఉంటాయి. శ్రియ, వివేక్, రఘువరన్‌, మణివణ్ణన్, వడివుక్కరసి లాంటి ఫేమస్ ఆర్టిస్టులంతా ఉన్నారు. అయితే ఆడియెన్స్ కు రజనీ తప్ప స్క్రీన్‌ మీద ఎవరూ కనిపించరు. ఆయన తర్వాత ఎవరైనా కాస్త రిజిస్టర్ అవుతారంటే అది విలన్‌గా నటించిన సుమన్ మాత్రమే. మొదటిసారే అయినా విలనీ చక్కగా పండించి మెప్పించారు. అయినా అది కొంతవరకే. ‘శివాజీ’ అంటే రజనీయే అనే రేంజ్‌లో తన పాత్రని పండించి మేజర్ క్రెడిట్ కొట్టేశారు రజనీకాంత్. 

మ్యూజికల్ ఫీస్ట్
శంకర్ సినిమాల్లోని పాటలు ఎప్పుడూ సూపర్ గానే ఉంటాయి. శివాజీ కూడా అంతే. రెహమాన్ కంపోజ్ చేసిన ప్రతి సాంగ్‌ పాపులర్ అయింది. మూవీ థీమ్ సాంగ్ మొదలు.. ఇందురుడో అరె చందురుడో.. అదిరెను స్టైలు.. వాజీ వాజీ వాజీ రారాజే నా శివాజీ.. అదరని వాడు వచ్చాడొచ్చాడొచ్చాడోయ్.. సహానా శ్వాసే వీచెనో సహారా పూవై పూచెనో.. ఇలా అన్ని పాటలూ సూపర్ డూపర్ హిట్టే. ఇంకో విశేషమేమిటంటే.. కళ్లుమూసి ఏ పాట విన్నా రజనీ కనిపిస్తాడుయ ఆయన స్టైల్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు, ఎక్స్ప్రెషన్స్కు అంత దగ్గరగా అనిపిస్తాయి ఆ పాటలు. 


ఈ సినిమా తర్వాత రజనీ, శంకర్‌‌ల కాంబినేషన్‌లో రోబో, రోబో 2.ఓ చిత్రాలు వచ్చాయి. మొదటిది సంలచన విజయం సాధిస్తే, రెండోది మాత్రం అంతంత మాత్రంగా అనిపించింది. వీళ్లు మరోసారి కలిసి పని చేస్తే చూడాలనేది చాలామంది ఆశ. శివాజీ రిలీజై పదిహేనేళ్లైన సందర్భంగా రజినీని కలిసిన శంకర్ తమ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఆశ మరింత పెరిగింది అభిమానులకి. అది మళ్లీ ఎప్పటికి సాధ్యపడుతుందో తెలీదు కానీ.. ఆల్రెడీ వీరి కాంబో సాధించిన సక్సెస్‌ మాత్రం హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతుంది.