శోభిత ధూళిపాళ్ల నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయ వేదికపై ఇది పోటీపడబోతోంది. తాజాగా 52వ ఎమ్మీ అవార్డుల నామినేషన్స్‌ను ప్రకటించగా.. అందులో మన దేశం నుంచి ‘ది నైట్ మేనేజర్’ నామినేట్ అయింది. పద్నాలుగు కేటగిరీస్‌లో భారతదేశం నుంచి నామినేట్ అయిన ఏకైక సిరీస్ ఇదే కావడం విశేషం.
ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. డ్రామా సిరీస్ కేటగిరీలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనాకు చెందిన సిరీస్‌లతో శోభిత నటించిన ఈ వెబ్ సిరీస్ పోటీపడనుంది. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఇందులో నటించినప్పటికీ శోభిత షో స్టాపర్‌గా నిలిచింది. 2016లో ఇదే పేరుతో వచ్చిన బ్రిటీష్ సిరీస్‌కు ఇది ఇండియన్ వెర్షన్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 25న న్యూయార్క్‌లో అవార్డుల వేడుక జరగనుంది.