ఉద్ధవ్ ఠాక్రే నాకు బాగా క్లోజ్.. కానీ ఫోన్ ఎత్తట్లే

ఉద్ధవ్ ఠాక్రే నాకు బాగా క్లోజ్.. కానీ ఫోన్ ఎత్తట్లే
  • చాలా సార్లు ఫోన్ చేశా.. అయినా రెస్పాన్స్ లేదు
  • కాంగ్రెసోళ్ల కన్నా శివసేన నేతలే ఘోరంగా మోడీని తిట్టారు
  • బీజేపీతో పొత్తు.. ఆ పార్టీకి ఇష్టం లేనట్టుంది: ఫడ్నవీస్
  • సీఎం పదవికి రాజీనామా చేశాక శివసేనపై విసుర్లు

మహారాష్ట్ర రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి.. రెండు వారాలు దాటిపోయినా ఇంకా ప్రభుత్వ ఏర్పాటులో క్లారిటీ రాలేదు. సీఎం పదవి విషయంలో 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబట్టగా.. బీజేపీ దానికి సుముఖత వ్యక్తం చేయలేదు.

నవంబరు 9వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముస్తుండడంతో శుక్రవారం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ శివసేనపై విరుచుకుపడ్డారు.

50:50 ఫార్ములాకు బీజేపీ ఎప్పుడూ ఓకే చెప్పలేదని ఫడ్నవిస్ చెప్పారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనకు బాగా క్లోజ్ అని, ఆయనతో ఆ బంధం కొనసాగుతుందని అన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయనకు చాలా సార్లు ఫోన్ చేసినా.. ఇప్పటి వరకు రెస్పాడ్ అవ్వలేదని చెప్పారు.

దీన్ని మేం సహించలేం

శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే బీజేపీని ఎప్పుడూ గౌరవించేవారని గుర్తు చేశారు ఫడ్నవిస్. తాము ఏ విషయంలోనూ ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదన్నారు. కానీ గడిచిన ఐదేళ్లుగా, ముఖ్యంగా ఈ పది రోజుల్లో బీజేపీని, ప్రధాని మోడీని ఉద్ధవ్, శివసేన నేతలు చాలా తీవ్రంగా విమర్శించారని మండిపడ్డారు. దీన్ని తాము సహించబోమని హెచ్చరించారు. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కూడా అంతలా తిట్టలేదన్నారు ఫడ్నవిస్. ఇలా మాట్లాడుతున్న వీళ్లకు బీజేపీతో పొత్తు ఇష్టం లేనట్టుందని, కేంద్రంలోనూ కొనసాగుతారో లేదో తెలయదని అన్నారు.

ఆ మాటతో షాకయ్యాం

దురదృష్టవశాత్తు ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఆప్షన్స్ ఓపెన్‌గా ఉన్నాయంటూ ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన స్టేట్‌మెంట్ తమను షాక్‌కు గురి చేసిందన్నారు దేవేంద్ర ఫడ్నవిస్. బీజేపీ-శివసేనకు కలిపి ప్రజలు తీర్పు ఇస్తే.. ఆయన ఆ కామెంట్స్ ఎలా చేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చర్చలు విఫలం కావడానికి నూటికి నూరుపాళ్లు శివసేననే కారణమని, కనీసం తన ఫోన్‌కు రెస్పాండ్ కాలేదని చెప్పారు. అయితే ఇంకా పొత్తు తెంచుకున్నట్లు శివసేన గానీ, తాము గానీ ప్రకటించలేదని, కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు దేవేంద్ర ఫడ్నవిస్.