బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు..ఇద్దరికి గాయాలు.. వీడియో వైరల్

బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు..ఇద్దరికి గాయాలు.. వీడియో వైరల్

పోలీస్స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్.. శివసేన నేత మహేష్ గైక్వాడ్ పై కాల్పులు జరిపిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం (ఫిబ్రవరి 02) మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్ నగర్ లోని హిల్లైన్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఓ భూవివాదంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన గణపతి గైక్వాడ్, మహేష్ గైక్వాడ్ మధ్య వాగ్వాదం ముదిరి కాల్పులకు దారి తీసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్  వైరల్ అవుతోంది. 

శుక్రవారం రాత్రి ఉల్హాస్ నగర్ లోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్ లోని సీఐ ఛాంబర్ లో కళ్యాణ్ శివసేన చీఫ్ మహేష్ గైక్వాడ్, అతని అనుచరులపై కళ్యాణ్ బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపినట్లు ఈ వీడియోలో కన్పిస్తోంది. గణపత్ గైక్వాడ్ ఒక్కసారిగా సీట్లోంచి లేచి మహేష్, అతని అనుచరులపై పిస్తల్ తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మహేష్, అతని అనుచరులు తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితంగా లేకుండా పోయింది. ఈ కాల్పుల్లో మహేష్ గైక్వాడ్ తోపాటు మరొకరికి గాయాలయ్యాయి. కాల్పుల శబ్ధం విన్న పోలీసులు వెంటనే ఛాంబర్ లోకి వచ్చి గణపత్ గైక్వాడ్ ను అడ్డుకున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ 

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ భూవివాదంపై ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతపై కాల్పులు జరిపి గాయపర్చిన బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో గణపత్ గైక్వాడ్ మాట్లాడుతూ తన కుమారుడిని కొట్టడం వల్లే తాను తుపాకీని ఉపయోగించానని చెప్పాడు.  గాయపడిన మహేష్ గైక్వాడ్, మరో వ్యక్తిని థానేలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

అడిషనల్ సీపీ షిండే తెలిపిన వివరాల ప్రకారం. గణపత్ గైక్వాడ్ కుమారుడు ఓ భూవివాదానికి సంబంధించిన ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన సమయంలో మహేష్ గైక్వాడ్ తన మనుషులతో వచ్చాడు. అనంతరం గణపత్ గైక్వాడ్ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎమ్మెల్యే, శివసేన నేతల మధ్య వాగ్వాదం జరిగి గణపత్ గైక్వాడ్ సీనియర్ ఇన్ స్పెక్టర్ ఛాంబర్ లో మహేష్ గైక్వాడ్ పై కాల్పులు జరిపారని దీంతో మహేష్ గైక్వాడ్, అతని అనుచరుడు గాయపడ్డారని షిండే తెలిపారు.