వర్ధన్నపేట,వెలుగు: కుటుంబ గొడవల కార ణంగా తండ్రిని కొడుకు కొట్టి చంపిన ఘటన వరంగల్జిల్లాలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి గుబ్బేటి తండాకు చెందిన ఆటో డ్రైవర్ సపావత్ సురేశ్(27), మౌనిక దంపతులకు ముగ్గురు పిల్లలు. కాగా.. తరుచూ భార్యాభర్తలు గొడవ పడుతుండగా సురేశ్ తండ్రి రాజు(49) సర్ధి చెప్పేవాడు. శనివారం రాత్రి మరోసారి సురేశ్బూతులు తిడుతూ భార్యపై పిడిగుద్దులు కురిపిస్తుండగా, రాజు వెళ్లి గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో సురేశ్ కోపంతో తండ్రి ఛాతి, ముక్కుపై, కడుపులో పిడి గుద్దులు కురిపించడంతో కిందపడిపోయాడు. మౌనిక కేకలు వేయడంతో తండావాసులు వచ్చారు. అప్పటికే రాజు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. ఆడబిడ్డ మాలోత్ స్వప్నకు మౌనిక సమాచారం ఇచ్చింది. మృతుడి కూతురు స్వప్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వర్ధన్నపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజు మృతితో తండాలో విషాదం నెలకొంది.
