బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే అభిమానులకు ప్రాణం. కానీ ఆ అభిమానం హద్దులు దాటితే అది ప్రాణాల మీదకు వస్తుందని నిరూపిస్తున్నాడో మధ్యప్రదేశ్ యువకుడు. సెలబ్రిటీల పట్ల ఉండే క్రేజ్ ఒక్కోసారి పిచ్చిగా మారుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలు ఈ పిచ్చి అభిమాని చేసిన పని చూస్తే వామ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే..
కనురెప్పలపై 'సల్మాన్' పేరు:
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు సల్మాన్ ఖాన్ మీద ఉన్న తన అభిమానాన్ని చాటుకోవడానికి అత్యంత ప్రమాదకరమైన పని చేశాడు. అత్యంత సున్నితమైన కనురెప్పల మీద సల్మాన్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. శరీరంలోని ఇతర భాగాలపై కూడా సల్మాన్ ఫోటోలు, పేర్లు ఉన్నప్పటికీ.. కనురెప్పలపై టాటూ వేయించుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కంటి చూపు పోయే ప్రమాదం ఉందని తెలిసినా అతను వెనకడుగు వేయకపోవటం ఇక్కడ గమనార్హం.
ALSO READ : నటుడు శివాజీ మీద డబుల్ అటాక్..
ఈ ఘటన జరిగి కొన్నాళ్లు అవుతున్నా.. సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ వీడియోలు మళ్లీ వైరల్ అయ్యాయి. తన అభిమాన హీరోని కలవడమే లక్ష్యంగా ఆ యువకుడు తన ఇంట్లోని వారికి చెప్పకుండా రైలెక్కి ముంబై చేరుకున్నాడు. బాంద్రాలోని సల్మాన్ నివాసం 'గెలాక్సీ అపార్ట్‌మెంట్స్' ముందు గంటల తరబడి పడిగాపులు కాశాడు. సల్మాన్ తన దైవమని, అతని కోసం ఏ రిస్క్ చేయడానికైనా సిద్ధమంటూ భావోద్వేగంతో చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలు చక్కర్లు కొడుతోంది.
కనురెప్పలపై టాటూలు వేయడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, నరాల దెబ్బతినడం, చివరకు శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం సెలబ్రిటీల కోసం ఇలా ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని అంటున్నారు. అయితే కొందరు దీనిని స్వచ్ఛమైన అభిమానం అంటుంటే.. మరికొందరు వికృత చేష్టలంటూ మండిపడుతున్నారు. అభిమానం ఉండాలి కానీ అది ఉన్మాదం కాకూడదని, సొంత ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పట్టించుకోకుండా.. ఇలాంటి పనులు చేయడం ఆ హీరోలకు కూడా నచ్చదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన సెలబ్రిటీ కల్చర్‌లోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.
