జెరూసలేంలో పాలస్తీనా సాయుధుల కాల్పులు.. ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి

 జెరూసలేంలో పాలస్తీనా సాయుధుల కాల్పులు.. ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి

జెరూసలేం: జెరూసలేంలో  గురువారం దారుణం జరిగింది. వీజ్‌మాన్ స్ట్రీట్‌లోని ఓ బస్టాప్‌లో వేయిట్ చేస్తున్న ప్రజలపై పాలస్తీనాకు చెందిన ఇద్దరు సాయుధులు(గన్ మెన్) విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో ముగ్గురు ఇజ్రాయెల్‌లు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. కాల్పుల సమయంలో అక్కడ ఇద్దరు ఆఫ్ డ్యూటీ సైనికులు, ఒక సాయుధ పౌరుడు ఉన్నారు. వెంటనే వారు  ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు పాలస్తీనా సాయుధులను హతమార్చారు.

చనిపోయిన పాలస్తీనా సాయుధులను మురాద్ నమర్(38), ఇబ్రహీం నామర్(30)గా  అధికారులు గుర్తించారు. వారు  తూర్పు జెరూసలేంకు చెందినవారని చెప్పారు. వీరి నుంచి ఎం 16 రైఫిల్, హ్యాండ్‌గన్‌ సీజ్ చేసినట్లు వెల్లడించారు. గతంలో వీరిద్దరూ హమాస్ మెంబర్లుగా పనిచేసినట్లుగా తేలిందన్నారు. టెర్రర్ ఎటక్ ప్లాన్ చేసినందుకు మురాద్‌కు 2010 నుంచి 2020 మధ్య జైలు జీవితం గడిపాడని తెలిపారు. ఇబ్రహీం కూడా 2014లో జైలుకు వెళ్లాడని చెప్పారు.  సరిగ్గా ఏడాది క్రితం అదే బస్టాప్‌లో  బాంబు దాడి జరిగింది.