
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత తీరడం లేదు. కొత్త, పాత మెడికల్ కాలేజీల్లో కలిపి 1,442 పోస్టులకు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వగా, సుమారు 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,069 మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హత సాధించినట్టుగా బోర్డు ప్రకటించింది. వీళ్లందరికీ గత నెల 22న ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. ఉద్యోగాల్లో చేరేందుకు నెల రోజులు గడువు ఇచ్చారు. బుధవారం నాటికి ఈ గడువు ముగియనుండగా, ఇప్పటివరకూ 687 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. ఇంకో 382 మంది ఇప్పటివరకూ రిపోర్ట్ చేయలేదు. మరో 45 రోజుల్లో ఎంబీబీఎస్ క్లాసులు స్టార్ట్ కానున్న నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. సుమారు 755 పోస్టులు ఖాళీగా ఉండడంతో స్టూడెంట్లకు క్లాసులు చెప్పడానికి, టీచింగ్ హాస్పిటళ్లలో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గాంధీ, ఉస్మానియా వంటి పాత కాలేజీల్లో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి, అవసరమైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు క్లాసులు చెప్పడానికి సీనియర్ రెసిడెంట్స్, పీజీలు హెల్ప్ చేస్తారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఈ రెండేండ్లలోనే ప్రారంభమయ్యాయి. ఈ కాలేజీల్లో పీజీలు, ఇంటర్న్స్ అసలు లేరు. దీంతో టీచింగ్, ట్రీటింగ్ భారం అసిస్టెంట్ ప్రొఫెసర్లపైనే పడనుంది.
మళ్లీ కాంట్రాక్ట్ పద్ధతిపైనే ఫోకస్
మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కొరతను నేషనల్ మెడికల్ కమిషన్ చాలా సీరియస్ గా పరిగణిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా చాలా కాలేజీల పర్మిషన్‌ను ఇదే కారణంతో ఎన్‌ఎంసీ రద్దు చేసింది. ఈ నెల 21న రిపోర్టింగ్ గడువు ముగిసిన తర్వాత, ఏయే కాలేజీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరాలతో సర్కార్‌కు లేఖ రాస్తామని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. సర్కార్ పర్మిషన్ ఇస్తే వెంటనే కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు.
కొత్తగా మరో 8 కాలేజీలు
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఈ రెండేండ్లలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. వీటితో కలిపి మొత్తం 24 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన 8 జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని మంత్రి హరీశ్‌రావు రెండ్రోజుల క్రితమే ప్రకటించారు. 755 పోస్టులకు తోడు, కొత్త కాలేజీల్లో 700 పోస్టుల వరకూ అవసరం అవుతాయి. వీటన్నింటికీ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా రిక్రూట్‌మెంట్ పూర్తి చేయాలి.