భారీ ప్రాజెక్టులకు నిధుల కొరత

భారీ ప్రాజెక్టులకు నిధుల కొరత

వ్యూహాత్మక  రహదారుల అభివృద్ధి ప్రణాళిక- (ఎస్ఆర్​డీపీ) ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న జీహెచ్ఎంసీ.. రెండో దశ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  ప్రాజెక్టుల వ్యయానికి సంబంధించి నిధుల సేకరణపై దృష్టి సారించింది. ఇందుకోసం మూడో విడత బాండ్ల విక్రయానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బాండ్ల విక్రయం ద్వారా రెండు విడతల్లో రూ.395 కోట్లు  సేకరించిన జీహెచ్ఎంసీ మూడో విడత బాండ్ల విక్రయానికి సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఎస్​ఆర్​డీపీ ప్రాజెక్టుల కోసం నిధుల సేకరణకు మూడో విడతలో బాండ్ల విక్రయం ద్వారా రూ.305 కోట్లు సేకరించేందుకు నిర్ణయించింది. ఈ నెలాఖరులో లేదా జూలైలో ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఫిబ్రవరిలోనే నిధుల సేకరణ చేపట్టాలని భావించినప్పటికీ వరుస ఎన్నికల నేపథ్యంలో నిధుల సేకరణ వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి పాలన పట్టాలెక్కుతున్న నేపథ్యంలో బాండ్ల విక్రయం అంశాన్ని ప్రధానంగా తీసుకుంటోంది.

బల్దియాకు ఆర్థిక కష్టాలు…

ఆదాయ, వ్యయాలు సమానమై.. బల్దియా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. భారీగా కూడబెట్టిన డిపాజిట్లు కరిగిపోవడంతో ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. అనుకోని అవాంతరాలు, అడ్డంకులతో ఖజానా ఖాళీ అయింది. ఏదైనా భారీ ప్రాజెక్టు చేపట్టాలంటే జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. హైదరాబాద్‌‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు జీహెచ్‌‌ఎంసీ పరితపిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఫ్లై ఓవర్లు, అండస్‌‌ పాస్‌‌ బ్రిడ్జీలు, రోడ్ల నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. అందుకే నిధుల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఖర్చుకు తగ్గ ఆదాయం లేకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది.

అభివృద్ధి కోసం అప్పులు…

హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం మేరకు జీహెచ్‌‌ఎంసీ భారీ అభివృద్ధి ప్రణాళికలు చేపట్టింది. మాదాపూర్‌‌, ఎల్బీనగర్‌‌ వంటి రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్లు, అండర్‌‌పాస్‌‌ రోడ్లు నిర్మించింది. నిధులు కటకట ఉన్నా.. ఈ మొత్తం అంతా అప్పుగా తెచ్చింది. బాండ్ల ద్వారా అప్పులు సేకరించడం ద్వారా గతేడాది ఫిబ్రవరిలో రూ.200 కోట్లు, ఆగస్టులో రూ.195 కోట్లు అప్పు చేసింది. బాండ్ల  ద్వారా మొత్తం రూ.1000 కోట్లు నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ గతంలోనే ప్రణాళికలు రచించింది. ఇప్పటికే రూ.395 కోట్లు సేకరించింది. తాజాగా మరో రూ.305 కోట్లు సేకరించాలని నిర్ణయించింది. వీటితో బాండ్ల విక్రయం ద్వారా సేకరించిన మొత్తం అప్పు రూ.700 కోట్లకు చేరనుంది.

ఆరు నెలల్లో రెండోసారి..

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బాండ్ల విక్రయం ద్వారా అప్పు చేసిన మొదటి నగరం పుణె. అయితే రెండో నగరం హైదరాబాద్‌‌. ఆ తర్వాత వరుసలో ఇండోర్‌‌ ఉంది. కానీ వీటన్నింటి కంటే జీహెచ్‌‌ఎంసీ ఘనత వహించింది. ఆరు నెలల వ్యవధిలో రెండో సారి బాండ్ల విక్రయం ద్వారా అప్పు చేసిన ఏకైక నగరంగా నిలిచింది. మొదటి సారి రూ.200 కోట్లు, రెండో సారి రూ.195 కోట్లు కలిపి మొత్తం రూ.395 కోట్లు అప్పు చేసింది. వీటిని పదేళ్లలో చెల్లించాలి. 17 శాతం వడ్డీ ఉంటుంది. నెలనెలా జీహెచ్‌‌ఎంసీ రాబడి నుంచి ఈ వడ్డీ కోత పడుతుంది.  భారీ ప్రాజెక్టులు చేపట్టి హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పని చేస్తోంది.  బాండ్ల ద్వారా సేకరించే మూడో విడత నిధులతో రెండోదశ ఎస్ఆర్ డీపీ పనులు
చేపట్టనున్నారు.