
కాగజ్ నగర్, వెలుగు: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీలో ఆఫీసర్లు, సిబ్బంది కొరతతో ప్రజలకు ఇబ్బంది ఎదురవుతోంది. బల్దియాలో నలభై మంది సిబ్బందికి గాను14 మంది మాత్రమే పని చేస్తున్నారు. 55 వేల జనాభా ఉన్న పట్టణం లో ప్రజలకు మున్సిపల్ సేవలు సరిగా అందడం లేదు. దీనికి తోడు చాలా మంది ఆఫీసర్లు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే వస్తుండడంతో సరైన సేవలు అందడం లేదు. ఇక మున్సిపల్ ఆఫీస్ లో పనుల కోసం వచ్చే వారికి సారు లేరు.. మళ్ళీ రా అన్న సమాధానమే లభిస్తోంది.
ఖాళీలు.. డిప్యూటేషన్లు
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఖాళీల భర్తీపై చేయడంలో మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించడం లేదు. మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ లో డీఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్ లు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారు. ఏఈ సతీష్ కుమార్ డిప్యూటేషన్ మీద పెద్దపల్లి మున్సిపల్ కు వెళ్లారు. ఉన్న ఒక్క ఏఈ రమాదేవి ఇన్చార్జి డిప్యూటీ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఓవర్సీస్ నలుగురు ఉండాల్సిన చోట ఒక్కరు కూడా లేరు. టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్లు ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరు లేరు. అకౌంట్స్ విభాగంలో రెండు సీనియర్, ఒక జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో ఏడుగురు ఉండాల్సిన చోట ఆరుగురు ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ లు ఆరుగురికి బదులు ఇద్దరే ఉన్నారు.
యూడీఆర్ఐ లింగయ్య డిప్యూటేషన్ మీద రామగుండం మున్సిపల్ లో పని చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ పోస్టింగ్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ యశ్వంత్ వారంలో మూడు రోజులు ఇక్కడ పని చేస్తుండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు రోజులు, మంథని మున్సిపల్ లో ఒక రోజు పని చేస్తున్నారు. ఇటీవల జరిపిన ట్యాక్స్ వసూలు, పట్టణంలో కొత్త బిల్డింగ్లు, ఇండ్ల నిర్మాణం కోసం అనుమతుల ప్రక్రియ పై అధికారులు, సిబ్బంది లేకపోవడం ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఖాళీల మీద దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు
కోరుతున్నారు.