
- ప్రభుత్వ కాలేజీల్లో పీడీల కరువు
- ఆటలకు దూరమవుతున్న స్టూడెంట్లు
- వృథాగా క్రీడా సామగ్రి
ఆసిఫాబాద్, వెలుగు: శారీరక ధృఢత్వం, మానసికంగా చురుగ్గా ఉండేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయి. క్రీడల్లో రాణించాలని అనేక మంది స్టూడెంట్లు కలలుకంటూ ఉంటారు. క్రీడలతోపాటు చదువుల్లోనూ రాణిస్తే తమ భవిష్యత్‌కు ఢోకా ఉండదని భావిస్తుంటారు.
అయితే పాఠశాల స్థాయిలో క్రీడలపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నా, ఇంటర్మీడియట్ విద్యకు వచ్చేసరికి సరిగా పట్టించుకోవడం లేదు. క్రీడల్లో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం కానీ ఒక్క కాలేజీలోనూ పీఈటీ ఉండడం లేదు. వారిని నియమించకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
మార్గదర్శకులు లేక నిరుత్సాహం
విద్య, ఉద్యోగ రంగాల్లో క్రీడలకు ప్రాధాన్యత పెరిగింది. ఉన్నత విద్యలో, వివిధ ప్రభుత్వ కొలువుల్లో స్పోర్ట్స్ కోటా కింద రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో క్రీడల్లో ప్రతిభ చాటిన వారు ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. ఇదే లక్ష్యంతో విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపుతున్నా.. మార్గదర్శకులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని వసతులు కల్పిస్తూ బలోపేతం చేస్తున్న సర్కారు. క్రీడల పట్ల మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలున్నాయి. పాఠశాల స్థాయిలో రాణించిన విద్యార్థులు కాలేజీల్లో చేరాక వాటిని మరిచిపోయే పరిస్థితులు
ఎదురవుతున్నాయి.
ఒక్క వ్యాయమ అధ్యాపకుడూ లేరు
ఆసిఫాబాద్ జిల్లాలో 11 మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో ఫస్టియర్‌లో దాదాపు 2500, సెకండియర్ లో దాదాపు రెండు వేల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. కాలేజీల్లో విద్యా బోధనతో పాటు వసతులు క్రమక్రమంగా మెరుగుపడుతున్నా పీడీల నియమాలు జరగడం లేదు. ప్రతి కాలేజీలో ఒక పీడీ ఉండాల్సి ఉన్నా జిల్లాలో ఎక్కడా నియమించకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం ఉన్నా.. ఫిజికల్ డైరెక్టర్ లేక జిల్లా, రాష్ట్ర, ఇతర పోటీలకు స్టూడెంట్స్ ఎంపిక కావడం లేదు.
మూలకు పడ్డ క్రీడా పరికరాలు
జిల్లాలోని గవర్నమెంట్ కాలేజీల్లో పీడీ టీచర్లు లేక ప్రభుత్వం పంపిణీ చేస్తున్న క్రీడా సామగ్రి మూలకు పడుతోంది. ప్రభుత్వం రెండేండ్లకోసారి క్రికెట్ కిట్లు, వాలీబాల్, క్యారమ్స్, చెస్ తోపాటు పలు రకాల క్రీడలకు సంబంధించిన సామగ్రి పంపిణీ చేస్తోంది. కానీ విద్యార్థులను ఆడించేందుకు పీడీలు లేకపోవడంతో ఆ సామగ్రి మూలకు పడుతోంది. ప్రభుత్వం స్పందించి ప్రతి కాలేజీలో పీడీలను నియమించి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
పీడీ లేక గేమ్స్ ఆడించడం లేదు
నేను దహెగాం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నా. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ కాలేజీలో పీడీ లేక స్పోర్ట్స్ ఆడించడం లేదు. లెక్చరర్లు ఆడించినా పూర్తిస్థాయిలో స్పోర్ట్స్ ఆడలేకపోతున్నాం. పీడీ ఉంటే బాగా ఆడేవాళ్లం– దుర్గం హరికృష్ణ, స్టూడెంట్, దహెగాం
నివేదిస్తున్నాం
ఏటా సర్కార్ కు ఖాళీల వివరాలను పంపిస్తున్నం. జిల్లాలో 11 ప్రభుత్వ కాలేజీల్లో పీడీ లేరు. నియామకం సర్కార్ పై ఆధారపడి ఉంటుంది. పీడీ లేకపోవడంతో లెక్చరర్లు ఆడిస్తున్నారు.– కల్యాణి, డీఈఐఓ, ఆసిఫాబాద్