రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల కొరత

రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల కొరత
  • 3 నెలలుగా 3 లక్షలకుపైగా పెండింగ్
  • కార్డుల సరఫరా ఆలస్యం వల్లే..
  • ముందే డబ్బులు కట్టి ఎదురుచూస్తున్న వాహనదారులు

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల కొరతతో వాహనదారులకు ఆర్సీ(రిజిస్ట్రేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌), డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ స్మార్ట్ కార్డుల జారీ ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు లక్షలకు పైగా కార్డులు పెండింగ్ లో ఉన్నాయి. కాంట్రాక్టర్​కు బకాయిలు చెల్లించకపోవడంతో  కార్డుల సరఫరా ఆగినట్లు తెలుస్తోంది. ప్రతి రెండు, మూడు నెలలకోసారి ఇదే సమస్య రిపీట్​ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో  56 ఆర్టీవో, యూనిట్ ఆఫీసులున్నాయి. ఈ కేంద్రాల ద్వారా డైలీ వందల సంఖ్యలో లైసెన్స్, ఆర్సీలు జారీ అవుతుంటాయి. అప్లికేషన్​ ప్రాసెస్  అయ్యాక 15 రోజుల్లో వాహనదారులకు కార్డులు చేరాలి. కానీ కొన్ని జిల్లాల్లో మూడు నెలలు పడుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ ల కంటే ఆర్సీ స్మార్ట్​ కార్డులే ఎక్కువ పెండింగ్‌‌‌‌ ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు చాలా జిల్లాల్లో  ఈ పరిస్థితి ఉంది. ఒకటి, రెండు కార్యాలయాల్లో మాత్రం పాత స్టాక్ ఉండటంతో కొద్దిగా ఆలస్యమైనా కార్డులు జారీ అవుతున్నాయి. రవాణా శాఖ ఆఫీసులకు ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ స్మార్ట్​ కార్డులతోపాటు స్టేషనరీ సరఫరా చేస్తోంది. కార్డులు అప్రూవల్​ అయ్యాక ఆర్టీవో ఆఫీసులోనే స్టాఫ్ ప్రింట్ చేసి పోస్ట్​ చేస్తారు. కార్డులు సకాలంలో రాక ఈ ప్రాసెస్​ ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. 

ముందే పైసలు వసూలు.. కార్టులెందుకు లేటు?
అప్లికేషన్​ టైమ్​లోనే స్మార్ట్​ కార్డుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్‌‌‌‌ లైసెన్సు కోసం వాహనదారుడు రూ.1,550 వరకు పే చేయాలి. ఇందులో పోస్టల్‌‌‌‌, సర్వీస్ చార్జీ కలిపి ఉంటాయి. యావరేజ్​గా లక్ష స్మార్ట్​ కార్డులు పెండింగ్​లో ఉన్నాయనుకున్నా 15 కోట్లకుపైనే  ఆర్టీఏ ఖాతాలో ఉంటున్నట్టు లెక్క. ఈ మొత్తాన్ని చెల్లించి స్మార్ట్​ కార్డులు ఎందుకు కొనడంలేదని, ముందే కార్డు తయారీ ఖర్చు వసూలు చేసికూడా ఎందుకు డిలే చేస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్ల ప్లానింగ్​ లోపం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

ఎం వాలెట్‌‌‌‌  ఎంత మందికి తెలుసు?
స్మార్ట్ కార్డుల జారీలో ఆలస్యంతో వాహనదారులు తనిఖీల టైమ్​లో ఇబ్బంది పడుతున్నారు.  ఎం వాలెట్​లో ఆర్సీలు, డ్రైవింగ్‌‌‌‌ లైసెన్సులు చూసుకునే అవకాశం ఉన్నా  చాలా మందికి దానిపై అవగాహన లేదు.  ఇక ఇతర రాష్ట్రాలకు వాహనాలను తీసుకెళ్లినప్పుడు అక్కడి పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది.  

సమస్యను వెంటనే పరిష్కరించాలె
ప్రతి రెండు, మూడు నెలలకోసారి స్మార్ట్ కార్డుల కొరత అంటున్నరు. కార్డుల కోసం వాహనదారులు ముందే పైసలు కడుతున్నరు. అయినా కార్డులు ఇన్ టైం లో ఇవ్వట్లేదు. దీంతో వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఇబ్బంది అవుతోంది. రాష్ట్రంలోనూ పోలీసులు ఫైన్ వేస్తున్నరు. సమస్యను వెంటనే పరిష్కరించాలె.
- సత్తిరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్