రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడులు .. రెండు మిసైల్స్​ను కూల్చేసిన ఉక్రెయిన్ ఆర్మీ

రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడులు .. రెండు మిసైల్స్​ను కూల్చేసిన ఉక్రెయిన్ ఆర్మీ
  • 33 డ్రోన్లు పడగొట్టిన రష్యన్ దళాలు

కీవ్: రష్యాకు చెందిన రెండు మిసైల్స్, 20 డ్రోన్లను కూల్చిసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. రష్యన్ దళాలు ఉక్రెయిన్​పై ఇస్కాండర్ క్రూయిజ్ మిసైల్, కేహెచ్ 59 గైడెడ్ ఎయిర్ మిసైల్స్ ప్రయోగించాయని తెలిపింది. షాహెడ్ టైప్ స్ట్రైక్ 20 డ్రోన్లను కూడా ప్రయోగించినట్లు వివరించింది. అన్నింటిని శనివారం రాత్రే కూల్చేసినట్లు వెల్లడించింది. రష్యా ఆక్రమించిన క్రిమియా, ఖార్సేన్ రీజియన్ నుంచే వీటిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

అయితే, ఈ దాడుల్లో ఎంత మేర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందో మాత్రం ఉక్రెయిన్ ఆర్మీ చెప్పలేదు. ఈ క్రమంలో ఉక్రెయిన్ దాడులపై రష్యా కూడా స్పందించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 33 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్​కు చెందిన మూడు బార్డర్ రీజియన్ల నుంచి ఈ దాడులు జరిగాయని తెలిపింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్​తోనే అన్నింటిని నేల కూల్చినట్లు వివరించింది. రష్యా బార్డర్ రీజియన్​లో డ్రోన్ దాడులు ప్రతి రోజూ జరుగుతూనే ఉన్నాయి.

రష్యా క్యాపిటల్ మాస్కోతో పాటు దాని శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడుతున్నది. ఇక రష్యా మాత్రం.. ఉక్రెయిన్​లోని కీలక ప్రాంతాలపై మిసైళ్లు, బాంబులతో అటాక్ చేస్తున్నది. రష్యా యూనిఫాం వేసుకున్న సుమారు 150 మంది డెడ్​బాడీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వీరంతా అవడివ్కా వైపు వెళ్తున్నప్పుడు జరిగిన దాడిలో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. రెండు వేర్వేరు వీడియో క్లిప్​లను ఉక్రెయిన్ డ్రోన్లు తీశాయి. చెల్లాచెదురుగా డెడ్​బాడీలు పడి ఉన్నాయి. పొలాల్లోని చెట్లన్నీ కాలిపోయాయి. ఆర్టిలరీ షెల్స్, డ్రోన్లు వదిలిన గ్రైనేడ్లతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.