ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నస్పూర్, వెలుగు: మన ఊరు – మనబడి పనులు స్పీడ్​గా పూర్తి చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి అధికారులకు సూచించారు. మండలలోని తీగల్ పహాడ్, కృష్ణ కాలనీ యూపీఎస్​, అంగన్వాడి కేంద్రాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. మన ఊరు – మన బడి పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిందని, జిల్లాలో మొదటి విడతలో 248 పాఠశాలలను ఎంపిక చేసి,  అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులను ఇన్​టైంలో పూర్తి చేయాలని, అధికారులు పనులను పర్యవేక్షిస్తూ నిర్లక్ష్యం లేకుండా చూడాలని తెలిపారు. 

అంతర్జాతీయ కిక్​బాక్సింగ్​ పోటీలకు వెళ్తున్న విద్యార్థికి విశాక ట్రస్ట్​ ఆర్థిక సహాయం

జైపూర్(భీమారం)వెలుగు: మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్​కు చెందిన పదో తరగతి స్టూడెంట్​ సడెమెక్ నితిన్ అంతర్జాతీయ కిక్​ బాక్సింగ్​ పోటీలకు సెలక్ట్ అయ్యాడు. దీంతో అతనికి విశాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఆర్థిక సాయాన్ని అందించారు. బీజేపీ మండల ప్రెసిడెంట్ వేల్పుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భరత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు, ప్రతిభావంతులకు విశాక చారిటబుల్​ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. నవంబర్​ 1 నుంచి 10 వరకూ ఢిల్లీలో జరిగే పోటీలకు నితిన్​ ఎంపిక కావడం సంతోషం గా ఉందన్నారు. ఈ సందర్భంగా అతనికి ట్రస్ట్ నుంచి రూ. 12 వేలను అందించినట్టు తెలిపారు. నితిన్ పోటీలల్లో గెలిచి స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్​చార్జి హెచ్ ఎం నరేందుల శ్రీనివాస్ , సిబ్బంది బి. శ్రీనివాస్, తపస్ జిల్లా అధ్యక్షులు సయింపు శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చల్లా రాజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకణాల సుధాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గాలిపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోట రాజేశ్, నాయకులు సెగ్గెం రాజేశ్​, జాడి అరవింద్ పాల్గొన్నారు.

దొంగతనం కేసులో అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్

రూ. 6 లక్షలు స్వాధీనం

నిర్మల్, వెలుగు: సారంగాపూర్ మండలం బీరవెల్లిలో ని మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్​లో దొంగతనం కేసులో నిందితులను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ ప్రవీణ్ కుమార్ గురువారం వెల్లడించారు. ఈనెల 10న అంతర్రాష్ట్ర దొంగలు అర్ధరాత్రి టైంలో సొసైటీ గ్రిల్ తొలగించి లాకర్​ను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితులు మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. ఈమేరకు పోలీసులు సారంగాపూర్ మండలం కౌట్ల వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఓ కారును పట్టుకున్నారు. ఆ కారులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా.. విషయం బయటపడింది. బీరవెల్లి లో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వడ్డే శీను సొసైటీ భవనంలో దాచి ఉంచుతున్న డబ్బు గురించి తెలుసుకున్నాడు. తన మామ హనుమంతు కుచెప్పాడు. దీంతో శీను, హనుమంతు దొంగతనం కోసం మహారాష్ట్రకు చెందిన దత్త రాథోడ్ గ్యాంగ్​కు సమాచారం ఇచ్చారు. దత్త రాథోడ్ తన అనుచరులైన సంతోశ్​ రాథోడ్, సురేశ్​ ఆడే తదితరులతో కలిసి లాకర్ ను ఎత్తుకు వెళ్లారు. దత్త రాథోడ్ తో పాటు రాజస్థాన్​, బిహార్​కు చెందిన సంతోష్​, సురేశ్, ప్రకాశ్​ మడావి, కుండలిక్ పవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.ఆరు లక్షల నగదును, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలోఉన్న హనుమంతు, కసావాకర్ చిన్న అలియాస్ వడ్డే శ్రీను కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పంచాయతీ రాజ్​లో అవినీతి ఆరోపణలపై విచారణ

మంచిర్యాల, వెలుగు: జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆఫీస్​అవినీతి ఆరోపణల నేపథ్యంలో పంచాయతీ రాజ్​ డిప్యూటీ కమిషనర్​ రవీందర్​రావు గురువారం డీపీవో ఆఫీస్​ను తనిఖీ చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపారు. వివిధ ఫైళ్లను పరిశీలించి, రికార్డులను తీసుకెళ్లారు. ఇప్పటికే కలెక్టర్​ భారతి హోళికేరి సైతం సదరు ఆరోపణలపై అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్​ నాయన్​​ను నివేదిక కోరారు. పంచాయతీ రాజ్​లో అవినీతి జరుగుతున్నట్టు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు నయీంపాష, రాజేందర్​ వివరాలు సేకరించి పంచాయతీరాజ్​ శాఖ కమిషనర్​కు, కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు దిగారు. 

ఎన్నో ఆరోపణలు..

 గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్​ పౌడర్​ను ఈ సంవత్సరం టెండర్లు లేకుండానే ఎక్కువ రేట్లకు కొనుగోళ్లు జరిపారు. మొదట 25 కిలోల బ్యాగుకు రూ.1,350 చెల్లించారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో రూ.1,190కి తగ్గించారు. ఈ బ్యాగు ధర రిటైల్​ మార్కెట్​లో రూ.వెయ్యి లోపే ఉంది. ఒక్కో బ్యాగుపై రూ.200 నుంచి రూ.300 అధికంగా చెల్లించారు. జన్నారం, హాజీపూర్, లక్సెట్టిపేట, జైపూర్​ మండలాలకు సప్లయ్​ చేసిన తర్వాత విషయం బయటకు రావడంతో కొనుగోళ్లు నిలిపేశారు. డీపీవో ఆఫీస్​లో ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్​కు జీతాలు ఇవ్వడానికి పంచాయతీ సెక్రటరీలు, ఎంపీవోల దగ్గర ప్రతి నెలా రూ.200 చొప్పున వసూలు చేసి, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో ప్రత్యేకంగా అకౌంట్​ ఓపెన్​ చేసి ఈ డబ్బులు అందులో జమ చేసినట్టు ఆరోపణలున్నాయి. 

కరీంనగర్​ జిల్లాలో ఇంటి నంబర్​ ప్లేట్ల ఏర్పాటుకు జారీ చేసిన సర్క్యులర్​ను మంచిర్యాల జిల్లాలో అమలు చేస్తూ డీపీవో ఉత్తర్వులు జారీ చేశారు. మందమర్రి, కాసిపేట, జైపూర్, భీమారం మండలాల్లో ఒక్కో నంబర్​ ప్లేట్​కు రూ.30 చొప్పున వసూలు చేశారు. దీనిపై ఇందారం గ్రామస్తులు నిరసన తెలుపడంతో ఆపేశారు. 

ఈ–పంచాయతీ ఆపరేటర్ల జీతాలను ప్రభుత్వం రూ.15వేల నుంచి రూ.22,750కి పెంచింది. పెరిగిన జీతాలను ఆరు నెలల ఏరియర్స్​తో పాటు చెల్లించడానికి డీపీవో ఆఫీస్​లోని ఒక అధికారి ఒక్కో ఆపరేటర్​ దగ్గర రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.  జిల్లాలో 16 మంది ఎంపీఓలు ఉండగా, కొన్ని నెలల కిందట 12 మందిని రూల్స్​కు విరుద్ధంగా ట్రాన్స్​ఫర్​ చేశారు. ఈ 12 మందికి సంబంధించిన శాలరీ బిల్స్​ను ట్రెజరీలో నిలిపేశారు. దీంతో ట్రాన్స్​ఫర్లను క్యాన్సల్​ చేస్తూ అవే స్థానాల్లో డిప్యూటేషన్లు ఇచ్చారు.డీపీఓ ఆఫీస్​కు సంబంధించిన అద్దె వాహనాల​ అలవెన్స్​లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. సొంత కారును వాడుకుంటూ రెంట్​ వెహికల్​ పేరిట నెలకు రూ.33 వేల బిల్లు తీసుకుంటున్నారు. 

బాల్క సుమన్ రాజీనామా చేస్తే చెన్నూర్​ అభివృద్ధి..

మందమర్రి,వెలుగు: ఎమ్మెల్యే బాల్క సుమన్​ తన పదవికి రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికలతో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయని బీజేపీ జిల్లా జనరల్​ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్​ అన్నారు. గురువారం మందమర్రిలో ఆయన మీడియా తో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రతిచోటా ఓడిపోతమనే భయంతో టీఆర్​ఎస్​ సర్కార్​ వేల కోట్ల ఫండ్స్​ను అభివృద్ధి పనులకు కేటాయిస్తుందన్నారు. ఉప ఎన్నికలతోనే చెన్నూరులో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మరో దళితునికి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే పదవి దక్కించుకున్న బాల్క సుమన్​ నియోజకవర్గంలో మాఫియాను ప్రోత్సాహిస్తూ వందల కోట్లు దండుకుంటున్నాడని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ సప్పిడి నరేశ్​, నియోజకవర్గ కన్వీనర్​ అక్కల రమేశ్​, టౌన్​ జనరల్​ సెక్రటరీలు గడ్డం శ్రీనివాస్​, అల్లంముల నగేశ్​, వైస్​ ప్రెసిడెంట్​ గాలిపెల్లి ఓదెలు, బీజైవైఎం ప్రెసిడెంట్ సురేందర్​, రంజిత్​, సాయి, అశోక్​ తదితరులు పాల్గొన్నారు.

టైలరింగ్ ​శిక్షణాకేంద్రం ప్రారంభం 

తిర్యాణి ,వెలుగు : మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని ఎస్పీ సురేశ్​ కుమార్​ సూచించారు. ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి లో పోలీస్, వసుధ స్వచ్ఛంద సేవాసంస్థ  సహకారంతో ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఛీప్​ గెస్ట్​గా ఎస్పీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు, యువతులు శిక్షణను ఉపయోగించుకోవాలన్నారు.మూడు నెలలు ట్రైనింగ్​ ఉంటుందని, వంద మందికి పైగా మహిళలతో తొలిబ్యాచ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్​ ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, రెబ్బెన సీఐ అల్లం నరేందర్, తిర్యాణి  ఎస్ ఐ రమేశ్ పాల్గొన్నారు.

సబ్సిడీ పరిశ్రమలతో అభివృద్ధి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: టీఎస్​-ఐపాస్, టీ-ప్రైడ్​ కింద అర్హులైన వారు పరిశ్రమలు స్థాపించుకొని సబ్సిడీలతో ఆర్థికాభివృద్ధి సాధించాలని అడిషనల్​ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ అన్నారు. కలెక్టరేట్​లో గురువారం జిల్లా పరిశ్రమల ప్రమోషన్​ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పలు పరిశ్రమల కు అనుమతులు వచ్చినట్టు చెప్పారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ ఎన్​.నటరాజ్​, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్​రాజు పాల్గొన్నారు.