ఆప్, కాంగ్రెస్​ పార్టీల కోసం .. ప్రత్యేక చట్టాలు చేయాల్నా : అనురాగ్ ఠాకూర్

ఆప్, కాంగ్రెస్​ పార్టీల కోసం .. ప్రత్యేక చట్టాలు చేయాల్నా : అనురాగ్ ఠాకూర్
 
  • యూత్ ఫర్ చేంజ్ కాన్​క్లేవ్’లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
  • ఫస్ట్ టైం ఓటర్లు దేశం కోసం ఓటేయాలని పిలుపు 

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణంలో జైల్లో పడ్డ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ప్రభుత్వానికి రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన కాంగ్రెస్​ కోసం ప్రత్యేక చట్టాలేమైనా రూపొందించాలా? అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు. గురువారం ఎన్డీటీవీ యూత్ ఫర్ చేంజ్ కాన్​క్లేవ్​లో ఆయన మాట్లాడారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్  సిసోడియాతో సహా కేజ్రీవాల్ సహచరులు ముగ్గురు కూడా అవినీతి ఆరోపణలపై జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. 

పదేండ్ల కింద రాజకీయాల్లోకే రానని తన పిల్లలపై బహిరంగంగా ప్రమాణం చేసిన కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆపై కాంగ్రెస్​తో ఎన్నటికీ పొత్తు ఉండదని చెప్పి ఆ పార్టీతోనే జత కట్టారని మండిపడ్డారు. ‘‘తనకు సెక్యూరిటీ అవసరంలేదన్నడు. అవినీతిపై పోరాడతానన్నడు. అనంతరం సెక్యూరిటీ లేనిదే బయట తిరుగలేదు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్నడు” అని కేజ్రీవాల్​నుద్దేశించి అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు. కనీసం ట్యాక్స్ రిటర్న్ లు కూడా దాఖలు చేయలేని అసమర్థత కాంగ్రెస్​ దని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధి కోసం ఓటేయండి.. 

దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలని తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతను అనురాగ్ ఠాకూర్ కోరారు. భారత్‌‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పని చేయడం పట్ల కఠినంగా ఉంటారని, యువత పట్ల ప్రేమతో ఉంటారని చెప్పారు. ఆయన 23 ఏండ్లుగా ఏనాడూ సెలవు తీసుకోలేదన్నారు.

ఫారిన్ రేటింగ్స్ పై ఆధారపడటం ఆపేద్దాం..

ఇండియాలో ఎంప్లాయ్ మెంట్ పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) ఇచ్చిన రిపోర్టుపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఐఎల్ వో రిపోర్టుకు, ఇండియన్ ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్టుకు పొంతన లేదని పేర్కొన్నారు. ‘‘దేశంలో 6.4 కోట్ల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో)లో రిజిస్టర్ అయ్యారు. ఈ సంఖ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల జనాభా కంటే కూడా చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగా 34 కోట్ల మందికి ముద్ర స్కీం కింద లోన్లు ఇచ్చినం. వాళ్లు వ్యాపారాలు పెట్టుకుని, మరికొంత మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కొన్నేండ్లుగా ఇంటర్నేషనల్ ఏజెన్సీల రేటింగ్స్ పైనే ఇండియా ఆధారపడుతూ వస్తున్నది.

 కానీ ఇకపై ఇండియన్ ఏజెన్సీల రిపోర్టులపై ఆధారపడాలి. మనమింకా బానిస మనస్తత్వంతోనే ఉన్నం. అందుకే ఫారిన్ ఏజెన్సీల రేటింగ్స్ నే నమ్ముతున్నం. మనం దాని నుంచి బయటకు రావాలి. మన దేశ ఏజెన్సీలు, సంస్థలను నమ్మాలి” అని పేర్కొన్నారు. కాగా, భారత దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, నిరుద్యోగుల్లో దాదాపు 83 శాతం మంది యువతే ఉన్నారని ఐఎల్ వో ఇటీవల ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నది.